కేరళకు చెందిన ఓ 75 ఏళ్ల వ్యక్తికి ఇటీవల మురిన్ టైఫస్ అనే అరుదైన బ్యాక్టీరియా వ్యాధి సోకింది. ఆ వృద్ధుడు ఇటీవల విదేశాలకు వెళ్లగా.. తిరిగి వచ్చిన తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర అలసటతో ఆస్పత్రి పాలయ్యాడు. అనంతరం అతడికి మెడికల్ టెస్ట్‌లు చేసిన డాక్టర్లు.. మురిన్ టైఫస్ సోకినట్లు గుర్తించారు. అయితే ఆ రోగి కాలేయం, మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. ఆ వృద్ధుడి నమూనాలను నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్‌కు పంపించి ఈ మురిన్ టైఫస్ అనే అరుదైన వ్యాధిని గుర్తించినట్లు డాక్టర్లు తెలిపారు. తమిళనాడులోని వెల్లూరులో మరిన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ మురిన్ టైఫస్‌ను ఫ్లీ బోర్న్ టైఫస్, ఫ్లీ బోర్న్ స్పాటెడ్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఆ వృద్ధుడు ఇటీవల వియత్నాం, కంబోడియా దేశాలకు వెళ్లినట్లు డాక్టర్లు తెలిపారు.
మురిన్ టైఫస్ వ్యాప్తి
ఈ మురిన్ టైఫస్ అనేది సాధారణంగా ఫ్లీ బర్న్ బాక్టీరియా రికెట్సియా టైఫి వల్ల సోకుతుంది. ఇది సోకిన దోమ మనుషులను కుట్టినపుడు వ్యాపిస్తుంది. ఎలుకలు, ముంగిసల ద్వారా కూడా ఈ మురిన్ టైఫస్ వ్యాప్తి చెందుతుంది. కొన్ని సందర్భాల్లో పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువుల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక దోమ ఈ మురిన్ టైఫస్ సోకితే దాని శరీరంలో అది జీవితాంతం ఉంటుంది. ఈ మురిన్ టైఫస్ సోకిన దోమ మలం.. మన శరీరంలోని చర్మంపై తాకినపుడు అది వ్యాప్తి చెందుతుంది. మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో వంటి రాష్ట్రాల్లో ఇలాంటి అరుదైన వ్యాధులు కనిపించాయి.
మురిన్ టైఫస్ లక్షణాలు
ఈ మురిన్ టైఫస్ సోకిన తర్వాత 7 నుంచి 14 రోజుల వరకు వివిధ రకాల లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, వికారం, వాంతులు, కడుపు నొప్పి, చర్మంపై దద్దుర్లు రావడం కనిపిస్తూ ఉంటాయి. ఈ మురిన్ టైఫస్ సోకిన వారికి ఈ లక్షణాలు రెండు వారాల కంటే ఎక్కువ ఉంటాయి. అయినప్పటికీ చికిత్స చేయకపోతే.. కొన్ని నెలల పాటు అలాగే ఉంటుంది.
మురిన్ టైఫస్‌కు చికిత్స
ఇప్పటివరకు మురిన్ టైఫస్‌కు చికిత్స అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. దీనికి వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. అయితే మురిన్ టైఫస్ చికిత్సలో భాగంగా డాక్సీసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్‌ను వాడుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారికి సకాలంలో చికిత్స అందించకపోతే.. వ్యాధి ఒకటి లేదా 2 వారాల్లో తీవ్రం అవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
మురిన్ టైఫస్‌ను నివారణ ఎలా
పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లలో దోమల నుంచి వాటిని దూరంగా ఉండేలా చూసుకోవాలి. వాటిని క్రమం తప్పకుండా కడగడం, దోమల గురించి అవగాహన కల్పించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అవసరమైతే చికిత్స చేయించాలని చెబుతున్నారు.