షాంఘై సహకార సంస్థ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీ వస్తే బాగుండేదని... తాను మరింత సంతోషించేవాడినని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ సదస్సుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ హాజరయ్యారు. జైశంకర్ హాజరు కావడంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఇది సానుకూల పరిణామం అన్నారు. ఇరుదేశాలు మరో డెబ్బై ఐదు సంవత్సరాలు నష్టపోరాదని అభిప్రాయపడ్డారు.గతాన్ని పక్కనపెట్టి ఇంధనం, వాతావరణ మార్పుల వంటి భవిష్యత్తు సవాళ్లను పరిష్కరించుకోవాలన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య చాలాకాలంగా నిలిచిపోయిన శాంతిచర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాలు పురోగతి సాధించాలంటే ఉద్రిక్తతలు ఉండరాదన్నారు. దశాబ్దాలుగా ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారంపై స్పందిస్తూ... చర్చలను ఎక్కడ ఆపేశామో... అక్కడి నుంచి తిరిగి ప్రారంభించాలన్నారు.