మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఆయన పాత్రపై ఆధారాలు లభించడంతో ఆయనను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. దర్యాప్తునకు రావాలని పోలీసులు నోటీసులు జారీచేయడంతో ఆయన గురువారం మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. విచారణ తర్వాత మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఏ120గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించామన్నారు. గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారని తెలిపారు.
తమవద్ద ఉన్న ఆధారాలతో సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించామని చెప్పారు. గత మూడు నెలలుగా ఈ కేసును విచారిస్తున్నామని సీఐ తెలిపారు. కేసు దర్యాప్తు చివరకు వచ్చిందని, నిందితులు చాలా మంది కోర్టుల ద్వారా రక్షణ పొందారన్నారు. దీంతో కేసు దర్యాప్తు వేగంగా జరగటంలేదన్నారు. నిందితులను అరెస్ట్ చేస్తే విచారణ త్వరగా పూర్తవుతుందన్నారు. ఈ కేసు విచారణను ప్రభుత్వం సిఐడికి అప్పగించిందని, ఉత్తర్వులు రాగానే విచారణ ఫైళ్లు సిఐడి అధికారులకు అప్పగిస్తామన్నారు.