విజయనగరం జిల్లా, బాడంగి మండల కేంద్రంలోని ఎస్సీ వీధికి చెందిన కండి రమేష్ (52) ప్రమాదవశాత్తూ స్థానిక మంచినీటి కోనేరులో కాలుజారి పడిపోవడంతో మృతిచెందాడు. ఎస్ఐ తారకేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు... రమేష్ బుధవారం మధ్యాహ్నం తన తోడల్లుడు బోనెల రవికుమార్‌తో కలసి బహిర్భూమికి వెళ్లాడు. కాలు కడుగుకునేందుకు కోనేరులో దిగి... ఈత రాని కారణంగా మునిగిపోయాడు.
రవికుమార్‌కు కూడా ఈత రాకపోవడంతో పరుగు పరుగున గ్రామంలోకి వెళ్లి స్థానికులకు ఈ విషయాన్ని చెప్పాడు. వారు వచ్చి గాలించినా ప్రయోజనం లేకపోయింది. స్థానిక సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రమేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు, అతని భార్య లక్ష్మి జామకాయల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. స్థానిక సీహెచ్‌సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.