ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు రూపొందించే కళాకారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ముడి సరుకుగా ఉపయోగించే అంకుడు కర్ర, కొండపల్లి బొమ్మలకు అవసరమయ్యే తెల్ల పొనికి చెట్లను విస్తారంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉండటంతో ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులకు ముడిసరుకు దొరకడం కష్టంగా మారుతోంది. దీంతో ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల కళాకారులు ఈ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఈ చెట్లను రాష్ట్రంలో విస్తారంగా పెంచాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు అందుబాటులో ఉండేలా అంకుడు, తెల్ల పొనికి చెట్లు పెంచడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇదే సమయంలో ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా ఈ చెట్లు పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అటవీ ప్రాంతాలతో పాటుగా ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో అంకుడు, తెల్ల పొనికి చెట్లు పెంచడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కనీసం రెండు మూడు తరాలకు సరిపడా చెట్లను పెంచేలా అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మరోవైపు ఏపీలో హస్తకళలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక చర్యలు తీసుకున్నారు. అతిథులకు అందించే బహుమతులుగా కూడా ఈ కళాకృతులనే అందిస్తున్నారు.
ఎంపీ గారు రండి.. పొడుగ్గా ఉంటారు ఎక్కడున్నా కనిపిస్తారు.. నారా లోకేష్ చమత్కారాలు
మరోవైపు పొనికి లేదా పొలికిగా ఈ చెట్టును పిలుస్తుంటారు. మనదేశంలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో పెరుగుతూ ఉంటుంది. కొండలు, గుట్టలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చెట్లలోనూ రెండు రకాలు ఉన్నాయి. తెల్ల పొనికి, అలాగే నల్ల పొనికి. తేలికగా, మృదువుగా ఉండటంతో పాటుగా ఎక్కువ కాలం మన్నే స్వభావం ఉండటంతో.. ఈ తెల్ల పొనికి చెట్టు కలపను బొమ్మల తయారీలో, నగిషీల తయారీలో వాడుతుంటారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలతో పాటుగా నిర్మల్ బొమ్మల తయారీలోనూ ఈ చెట్టు కలపను ఉపయోగిస్తారు. అయితే అడవుల నరికివేతతో పాటుగా ఈ చెట్టు విత్తనాలకు సహజంగా మొలకెత్తే స్వభావం కాస్త తక్కువగా ఉండటంతో చెట్ల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.