శాంతి, భద్రతల పరిరక్షణకు ఏపీ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణగా నిలుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. ఇవాళ (సోమవారం) పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో అమరవీరుల స్థూపానికి సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు. ముందుగా ముఖ్యమంత్రితోపాటు హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.." దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు నివాళులు అర్పిస్తున్నా. శాంతిభద్రతల కోసం వారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తులపై పోరాడిన ఉమేశ్ చంద్ర, వేదవ్యాస్ లాంటి పోలీసులు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. వారి స్ఫూర్తి ప్రతి పోలీసులో ఉంది. దేశానికి, రాష్ట్రానికి ఈ శాఖ చాలా కీలకం. రాత్రి, పగలు తేడా లేకుండా పని చేస్తారు. పోలీసు ఉద్యోగం సవాళ్లతో కూడుకుంది. 24 గంటలూ పని చేసే ఏకైక శాఖ పోలీసు శాఖ. వారికి పండగలు ఉండవు, ఎప్పుడూ విధుల్లోనే ఉంటారు. తిరుమల బ్రహ్మోత్సవాలు, దుర్గమాత ఉత్సవాలు, విజయవాడ విపత్తులో పోలీసుల పాత్ర అభినందనీయం. భారతదేశంలోనే ఏపీ పోలీసు వ్యవస్థ ఒక బ్రాండ్ అయిపోయింది అని అన్నారు.