మంత్రి గొట్టిపాటి రవికుమార్ మానవత్వం చాటుకున్నారు. ఈరోజు (మంగళవారం) అధికారిక కార్యక్రమం నిమిత్తం క్యాంపు కార్యాలయం నుంచి ఒంగోలుకు మంత్రి వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యలో త్రోవగుంట వంతెనపై గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీ కొట్టడంతో, తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న ఓ వ్యక్తిని మంత్రి చూశారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్సను అందించారు.
గాయపడిన వ్యక్తి బల్లికురవ మండలం అంబడిపూడి గ్రామానికి చెందిన కొవ్వూరి కోటేశ్వరరావుగా గుర్తించారు. వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి క్షతగాత్రుడిని తరలించారు. కిమ్స్ డాక్టర్లకు ఫోన్ చేసి, యాక్సిడెంట్ వివరాలు తెలిపి, క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి పట్ల మంత్రి రవికుమార్ స్పందించిన తీరుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.