ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏపీలో వర్షాలు, వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలు, వరదల్లో ఇబ్బందులు పడిన వారికి మరో సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రూ.50 వేల వరకు రుణాలు రీ-షెడ్యూల్ చేసుకున్న వారికి స్టాంప్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం 10 వరద ప్రభావిత జిల్లాల్లో వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయించింది. మరోవైపు వచ్చే కేబినెట్ భేటీలో దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
విజయవాడ సహా ఇతర ప్రాంతాల్లోని వరద బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు రకాలుగా సాయం అందించింది. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన టీడీపీ కూటమి సర్కారు.. ఇళ్లు మునిగిపోయిన వారికి, చిరు వ్యాపారులకు కూడా ఆర్థిక సాయం అందించింది. మొత్తం రూ.682 కోట్ల రూపాయలకు వరద బాధితుల అకౌంట్లలోకి జమచేసింది. గ్రౌండ్ ఫ్లోర్లలో నివసించేవారికి రూ.25000, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండేవారికి రూ.10000 చొప్పున పరిహారం అందించింది. అలాగే చనిపోయిన పశువులు, దెబ్బతిన్న పంటలకు కూడా పరిహారం అందించింది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో వాహనాలు దెబ్బతిన్న వారి బీమా క్లెయిమ్‌ల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్‌లు, కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు.
తాజాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రూ. 50 వేల లోపు రుణాలు రీ షెడ్యూల్ చేసుకున్న వారికి స్టాంప్ డ్యూటీ మినహాయించాలని నిర్ణయించింది. స్టాంప్ డ్యూటీ మినహాయింపుపై వచ్చే కేబినెట్ భేటీలో చంద్రబాబు, మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. స్టాంప్ డ్యూటీ మినహాయింపుపై ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని గత కొన్నిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నెలలో జరిగిన రెండు మంత్రివర్గ సమావేశాల సమయంలోనూ ఈ విషయం గురించి చర్చకు వచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వచ్చే కేబినెట్ భేటీ తర్వాత దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.