ఎన్టీఆర్ జిల్లాలో రెండు స్టాక్ పాయింట్లలో ఇసుక నిల్వలు ఉన్నాయి. మొగలూరు స్టాక్ పాయింట్‌లో 25వేల టన్నులు, అనుమంచిపల్లి స్టాక్ పాయింట్‌లో మరో 25 వేల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద 50 వేల టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో కొన్ని మార్పులు చేసింది. రోజుకు 3వేల టన్నుల ఇసుకను తీసుకెళ్లేలా భూగర్భ గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను తీసుకెళ్తుండడంతో నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. దీనితో అధికారులు కొద్దిరోజుల క్రితం కార్మికులతో ఇసుకను తవ్వించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి టెండర్లను ఆహ్వానించారు.
ఈ విధంగా ఇసుకను తవ్వడానికి జిల్లాలో 15 రీచ్‌లను అధికారులు గుర్తించారు. ఈ టెండర్లను అధికారులు ఖరారు చేశారు. వాస్తవానికి ఈ నెల 16 నుంచి రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పనులకు ఎగువ నుంచి వస్తున్న వరద అడ్డంకి మారింది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురవడంతో తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. సెప్టెంబరు ఒకటో తేదీన కృష్ణా నదికి భారీగా వరద వచ్చింది. ఇది క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈనెల పదో తేదీ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు మళ్లీ వస్తున్న వరద క్రమంగా పెరుగుతోంది. ఈ నెల ఏడో తేదీన 30వేల క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో తాజాగా లక్ష క్యూసెక్కులకు చేరింది. ఎగువ ప్రాజెక్టుల నుంచే కాకుండా, వాగుల నుంచి వస్తున్న నీరు నదిలో కలుస్తోంది. ఫలితంగా నది ఎగువ, దిగువ ప్రాంతాల్లో నిండుగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టులు, వాగుల నుంచే కాకుండా పులిచింతలో జలవిద్యుత్ కేంద్రం నుంచి నీరు ప్రకాశం బ్యారేజ్‌కు వస్తోంది. ఈ మూడు కారణాలతో రీచ్‌ల నిండా నీరు చేరింది. 15 రీచ్‌ల్లో 11 రీచ్‌లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. మరో నాలుగు రీచ్‌లకు ఉన్న అప్రోచ్ రోడ్లను వరద నీరు ముంచెత్తింది. ఫలితంగా రీచ్‌ల్లోకి వెళ్లే మార్గం మూసుకుపోయింది. దీనితో భూగర్భ గనుల శాఖ అధికారులు ఇసుక తవ్వకాలను నిలుపుదల చేశారు. మరో వారం రోజుల్లో నదికి వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇన్‌ఫ్లో తగ్గిన తర్వాతే తవ్వకాలు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.