మచిలీపట్నంలోని బుట్టాయిపేట సెంటరులోని ఓ బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్న వ్యక్తికి మచిలీపట్నం నిజాంపేటకు చెందిన వడ్డీ వ్యాపారి పాత మిత్రుడు. దీంతో తరచూ వారి ఇంటికి, బ్యాంకు వద్దకు వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని బైపాస్ రోడ్డులో 227 గజాల స్థలం ఉందని, ఆ ప్రాంతంలో గజం స్థలం రూ.30వేల వరకు ఉందని, తనకు తెలిసిన వ్యక్తికి నగదు అత్యవసరం కావడంతో గజం స్థలం రూ.20వేలకు విక్రయించేందుకు సిద్ధపడ్డాడని నమ్మించాడు. స్థలం వద్దకు తీసుకువెళ్లి ఓ వ్యక్తిని పరిచయం చేసి అతనే స్థలానికి యజమాని అని చెప్పాడు. స్థలం కొనుగోలు నిమిత్తం టోకెన్ అడ్వాన్సుగా తొలుత రూ.10లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అంతనగదు ఇప్పటికిప్పుడు తనవద్ద లేదని సదరు బ్యాంకు మేనేజర్ చెప్పడంతో ఈ నగదును తానే సమకూరుస్తానని నమ్మించాడు.
మరికొద్ది రోజులకు రెండో విడత టోకెన్ అడ్వాన్సుగా రూ.5లక్షలు స్థలం యజమాని అడుగుతున్నాడని చెప్పాడు. ప్రస్తుతం తనవద్ద నగదు లేదని మేనేజర్ చెప్పడంతో ఈ నగదును కూడా తానే సమకూరుస్తానని చెప్పి ఇచ్చాడు. కొద్దిరోజులు పోయాక మీ కోసం వేరే వ్యక్తి వద్ద నగదును అప్పుగా తీసుకున్నానని, రూ.15 లక్షలకు రోజుకు రూ.15వేల చొప్పున వడ్డీ కింద ఇరవైరోజులపాటు రూ.3లక్షలను వసూలు చేశాడు. ఇంత పెద్దమొత్తంలో రోజువారీ వడ్డీ తాను కట్టలేనని, గతంలో తనవద్ద తీసుకున్న రూ.9లక్షలను జమ చేసుకోవాలని సదరు బ్యాంకు మేనేజర్ చెప్పడంతో వడ్డీ వ్యాపారి రెచ్చిపోయాడు. బ్యాంకు మేనేజర్ ఇంటికెళ్లి నీ ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరించడతో పాటు అతనిపై ఆయన కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.