ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశంగా గుర్తింపు పొందిన భారత్.. రోజుకు 13,600 సర్వీసులు నడుపుతూ 2 కోట్ల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తోంది. సరుకు రవాణా ద్వారా కూడా ఆదాయం పుష్కలంగా లభిస్తోంది. రైల్వే ఆదాయంలో సరుకు రవాణా తొలి స్థానంలో.. ఆ తర్వాతి ప్రయాణికుల ద్వారా వచ్చే ఆదాయం ఉన్నాయి. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తోంది. ఇదే సమయంలో మానవతా దృక్పథంతో కూడా రైల్వే వ్యవహరిస్తోంది. ఎంపికచేసిన ప్రయాణికులకు టికెట్ ధరల్లో 75 శాతం రాయితీ కల్పిస్తోంది.
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు, థలసేమియా, కేన్సర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు, ఎయిడ్స్, టీబీ, హీమోఫీలియా, అప్లాస్టిక్ అనీమియా, అనీమియా, మూగ, చెవిటి, దృష్టిలోపం ఉన్నవారికి, మానసిక దివ్యాంగులు, పీడబ్ల్యూడీ కేటగిరిలో ఉన్నవారికి టికెట్ ధరలపై 75 శాతం రాయితీ కల్పిస్తోంది. ఇలాంటి వారు స్లీపర్, జనరల్, థర్డ్ ఏసీలో ప్రయాణానికి టిక్కెట్ బుక్ చేస్తే 75 శాతం, సెకండ్ ఏసీ, మొదటి ఏసీలో అయితే 50 శాతం రాయితీ ఉంటుంది. అలాగే, రాజధాని, శతాబ్ది వంటి రైళ్లల్లో ఏసీ చైర్ కార్, థర్డ్ ఏసీలో 25 శాతం రాయితీ వర్తిస్తుంది. వీరి వెంట తోడుగా వచ్చేవారికి కూడా టిక్కెట్‌లో డిస్కౌంట్ ఉంటుంది. రాజధాని, శతాబ్ది, హంసఫర్, గతిమాన్, వందేభారత్ సహా అన్ని రైళ్లలోనూ దివ్యాంగుల కోటా అమలవుతుందని రైల్వే శాఖ వెల్లడించింది.
ఉన్నత విద్య కోసం దేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు వారు ఎంచుకునే తరగతిని బట్టి టికెట్ ధరపై 50 నుంచి 75 శాతం వరకు రాయితీ కల్పిస్తోంది. ఎడ్యుకేషన్ టూర్లు, సొంతూరుకు వెళ్లే సమయంలో వీటిని ఉపయోగించుకోవచ్చు. యూపీఎస్పీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి జాతీయ స్థాయి పరీక్షలకు హాజరయ్యే సమయంలో కూడా హాల్ టికెట్ చూపించి టికెట్ ధరపై రాయితీని పొందొచ్చు. కాగా, సీనియర్ సిటిజన్లకు కూడా రైల్వే రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించిన వయో పరిమితిని పెంచేందుకు చేసిన ప్రయత్నాలపై విమర్శలు రావడంతో రైల్వే శాఖ వెనక్కితగ్గింది.