గత కొద్దికాలంగా కెనడా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయడానికి వీసాలను భారీగా కుదించిన జస్టిస్ ట్రూడో ప్రభుత్వం.. తాజాగా వారిని ఆందోళనకు గురిచేసే మరో నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థుల ఫుడ్ బ్యాంక్ (Food Bank)ల సేవల్లో కోత విధించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కోర్సుల్లో మొదటి ఏడాది అంతర్జాతీయ విద్యార్థులకు ఈ సౌలభ్యం కల్పించకూడదని వాంకోవర్‌లోని ఫుడ్ బ్యాంకు నిర్ణయించింది. ఆహార ధరలు, నిరుద్యోగం పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతర్జాతీయ విద్యార్థుల్లో అధిక శాతం భారతీయులే కావడంతో ఈ నిర్ణయం వారిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇటీవల కెనడాలో జీవన వ్యయ భారీగా పెరగడంతో అక్కడ ఉచితంగా ఆహారం అందించే ఫుడ్ బ్యాంకులపై అంతర్జాతీయ విద్యార్థులు ఆధారపడుతున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఈ ఏడాది మార్చిలో 20 లక్షల మంది విద్యార్థులు ఫుడ్ బ్యాంకులను ఆశ్రయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 6శాతం అధికం కాగా... ఐదేళ్ల కిందటి కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణం, జీవనప్రమాణ వ్యయాలు విపరీతంగా పెరగడం వంటివి వాటితో తాము తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు కెనడా ఫుడ్ బ్యాంక్స్ సీఈవో కిర్‌స్టిన్ బియర్డ్‌స్లీ అన్నారు.
ఇక, తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల జీవన వ్యయ పరిమితిని ఇటీవల కెనడా రెట్టింపు చేసింది. 10వేల డాలర్లుగా ఉన్న స్టూడెంట్ డిపాజిట్‌ను జనవరి 1 నుంచి 20,635 డాలర్లకు పెంచింది. రెండు దశాబ్దాల తర్వాత దీనిని సవరించింది. ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫుడ్ బ్యాంకు సేవలను రద్దుచేయడాన్ని ది గ్రేటర్ వాంకోవర్ ఫుడ్ బ్యాంకు సమర్థించుకోవడం గమనార్హం. ఇటీవల పెంచిన స్టూడెంట్ డిపాజిట్‌ను ఈ ఖర్చుల కింద చూడాలని వాదిస్తోంది. ఈ నిర్ణయంపై అంతర్జాతీయ విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వాంకోవర్ ఫుడ్ బ్యాంక్ నిర్ణయం దారుణమని.. కొత్తగా ఇక్కడకు వచ్చే విద్యార్థులకు కష్టంగా మారుతోందని భారతీయ విద్యార్ధి జస్కార్ సింగ్ అన్నారు.
‘స్టూడెంట్ వీసా పొందడానికి అంతర్జాతీయ విద్యార్థులు చూపించాల్సిన నిధుల మొత్తం వాంకోవర్‌లో వాస్తవ జీవన వ్యయం కంటే చాలా తక్కువ’ అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ‘పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ఈ ఫుడ్ బ్యాంకులు నడుస్తున్నాయి.. యూబీసీ ఫుడ్ బ్యాంక్ అనేది క్యాంపస్ వనరు.. పాక్షికంగా అంతర్జాతీయ విద్యార్థుల ట్యూషన్, ఫీజుల ద్వారా దీనికి నిధులు సమకూరుస్తున్నారు. కాబ్టి వారు నిధుల కోసం సహకరిస్తున్నందున సేవలు అందించాల్సిందే’ అని మరో నెటిజన్ అన్నారు.