ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూకే జంట కేసులో గూగుల్‌కు ఎదురుదెబ్బ.. రూ.22,400 కోట్ల భారీ జరిమానా

international |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2024, 12:14 AM

టెక్ దిగ్గజం గూగుల్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమ వెబ్‌సైట్ ర్యాంకింగ్ విషయంలో యూకే జంట 15 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటానికి ఫలితం దక్కింది. సెర్చ్ ఫలితాల్లో ప్రత్యర్థుల కంటే, తన సొంత షాపింగ్‌ సిఫార్సులకు ప్రయోజనాన్ని అందించినందుకు గాను గూగుల్‌పై ఐరోపా సమాఖ్య (ఈయూ) భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా గూగుల్‌ తన చివరి చట్టపరమైన సవాల్ అవకాశాన్ని తాజాగా కోల్పోయింది. 2017 నుంచి కొనసాగుతున్న యాంటీ ట్రస్ట్‌ కేసులో ఈయూ న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ఐరోపా దేశాల కూటమికి చెందిన అగ్రశ్రేణి యాంటీ ట్రస్ట్‌ ఎన్‌ఫోర్సర్‌ అయిన యూరోపియణ్‌ కమిషన్‌ విధించిన 2.4 బిలియన్‌ యూరోల ( 2.7 బిలియన్‌ డాలర్ల ` సుమారు రూ.22,400 కోట్లు) జరిమానాను గూగుల్‌ చెల్లించాలని ఈయూకు కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌ తుది తీర్పు వెల్లడిచింది.


ఈ విషయంలో గూగుల్ దావాను తిరస్కరించి, దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. చాలా నిర్దిష్టమైన వాస్తవాలకు సంబంధించిన కోర్టు నిర్ణయంతో నిరాశ చెందామని గూగుల్‌ పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళ్తే.. యూకేకు చెందిన దంపతులు శివన్, ఆదమ్ రాఫ్‌లు 2006లో ‘ఫౌండమ్’ అనే వైబ్‌సైట్‌ను ప్రారంభించారు. లైవ్‌లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వెబ్‌సైట్ సెర్చ్ వాల్యూమ్ పడిపోయింది. ‘కాస్ట్ కంపారిజన్’, ‘షాపింగ్’ వంటి కీలక పదాల గూగుల్‌లో శోధిస్తుంటే తమ కంపెనీ పేరు చూపించకపోవడంతో వారు షాకయ్యారు.


‘గూగుల్ ఆటోమేటెడ్ స్పామ్ ఫిల్టర్‌ సెర్చ్ పెనాల్టీ కారణంగా సైట్ ఊహించిన దాని కంటే ర్యాంకింగ్‌లో దారుణంగా పడిపోయింది. ఈ క్రమంలో గూగుల్ పెనాల్టీని ఎదుర్కొవాల్సి వచ్చింది.. మా ఆదాయం పడిపోయింది’ అని శివన్ తెలిపారు. ‘‘మా పేజ్ ఎలా ర్యాంకింగ్ అవుతుంది... అవన్నీ దాదాపు వెంటనే క్షీణించడం మేం గమనించాం’’ అని అన్నారు. ప్రారంభంలో సాంకేతిక కారణాలతో ఇలా జరుగుతుందని అనుకున్నామని చెప్పారు. రెండేళ్ల పాటు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ గూగుల్ పెనాల్టీని ఎత్తివేయలేదని అన్నారు. కానీ, ఇతర సెర్చ్ ఇంజిన్‌లో సాధారణంగా ర్యాంకింగ్ అయ్యేదని తెలిపారు.


దీనిపై 2010లో ఐరోపా సమాఖ్య కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో సుదీర్ఘ విచారణ అనంతరం గూగుల్ మోసం వెలుగులోకి వచ్చిందని శివన్ వెల్లడించారు. ఫౌండమ్ వంటి ప్రత్యర్థుల కంటే, తన సొంత షాపింగ్‌ సిఫార్సులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు గుర్తించి, 2017లో 2.4 బిలియన్ పౌండ్లు (2.7 బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. దీనిపై యూరోపియన్ కోర్టు ఆఫ్ జస్టిస్‌‌లో అప్పీల్‌కు వెళ్లగా.. తాజాగా కింది కోర్టు తీర్పును సమర్దించింది.


కాగా, 2016లో ఫౌండమ్‌ను మూసివేయాల్సి వచ్చినప్పటికీ.. గూగుల్‌పై నష్టపరిహారం దావా వేశారు. ఇది 2026లో విచారణకు రానుందని శివన్ తెలిపారు.. ‘ఇంత సమయం పడుతుందని మాకు తెలిసి ఉంటే, మేము ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉండేవాళ్లం... మా 15 ఏళ్ల న్యాయ పోరాటానికి ఫలితం దక్కింది.’ అని రాఫ్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com