వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను డిసెంబరు 23న విడుదల చేశారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయగా.. డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేశారు. డిసెంబర్ 26, సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేశారు.
శ్రీవారి దర్శనార్థం తిరుపతి స్థానికులకు 2025, జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. గత టిటిడి బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. 2025, జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జనవరి 5న తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల బాలాజీ నగర్ లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందవలసి ఉంటుంది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకుని జనవరి 7వతేదీ మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జనవరి 7వ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. జనవరి 7వ తేది కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో 6వ తేది సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది.