పోలవరం ప్రాజెక్టు సీఎం చంద్రబాబుకు ఏటీఎమ్ లా మారిందని, డ్యామ్ ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటే కూటమి ప్రభుత్వ నేతలు మౌనంగా ఉన్నారని వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సవరించిన అంచనాల మేరకు ఎత్తును పరిమితం చేయడం అంటే రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్టేనని, దేని కోసం లాలూచీ పడి మీరు ఈ అన్యాయానికి ఒడిగట్టారని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో, ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ కు ఆస్కార్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై జగన్ తప్పుడు ప్రచారం మానుకోవాలని అన్నారు. తల్లి, చెల్లిని మోసం చేసి జగన్ అందరితో ఛీకొట్టించుకుంటున్నారని విమర్శించారు. ప్రజల్లో ఉండేందుకు అర్హత లేదని జగన్ కు అర్థమైందని, అందుకే ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మంత్రి నిమ్మల మండిపడ్డారు. జగన్ అనుకూల మీడియా పోలవరంపై దుష్ప్రచారం చేస్తోందని, పూర్తి వివరాలతో పోలవరం ఎత్తుపై స్పష్టత ఇచ్చానని, అయినా జగన్ బుద్ధి మారడంలేదని విమర్శించారు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమేనని నిమ్మల ధ్వజమెత్తారు. నాడు కృష్ణా నది మిగులు జలాల్లో వాటా కోరబోమని జగన్ లేఖ రాశారని ఆరోపించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో 15 నెలలు జాప్యం చేశారని, దాంతో డయాఫ్రం వాల్ దెబ్బతిందని వెల్లడించారు. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడంలో జగన్ పాపం లేదా? అని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇచ్చిన రూ.3,800 కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. నాడు పోలవరం ఎత్తును తగ్గించాలని కోరింది జగనే అని ఆరోపించారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించాలని జగన్ కోరారని నిమ్మల స్పష్టం చేశారు. తాము పోలవరం ఎత్తును 45.72 మీటర్ల ఎత్తుకు పెంచి ఏపీని సస్యశ్యామలం చేస్తామని మంత్రి నిమ్మల వివరించారు. జగన్ ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మాని, కుటుంబ కలహాలు చక్కదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.