దీపావళి పండుగ వేళ దేశ ప్రజలకు గ్యాస్ సిలిండర్ ధరలు షాకిచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిండర్‌పై మరో రూ.62 పెరిగింది.దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1802కు చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర జోలికి మాత్రం వెల్లకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. వరుసగా నాలుగో నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఈ కాలంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర నాలుగు మెట్రోలలో గ్యాస్ సిలిండర్‌కు సగటున రూ.156 పెరిగింది.మరోవైపు 2024 మార్చి నుంచి దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. గత సారి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.100 తగ్గింది. నవంబర్ 1 నుండి దేశీయ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కోసం దేశంలోని నాలుగు మెట్రోలు ఎంత చెల్లించాల్సి ఉంటుందో చూద్దాం.
మార్చి నుంచి దేశంలోని నాలుగు మహానగరాల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. మార్చి నెలలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.100 తగ్గింది. అంతకు ముందు 2023 ఆగస్టు 29న గృహోపకరణ గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింది. ఇక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం మంచిదేనని చెప్పవచ్చు. ఢిల్లీలో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.803గా ఉండగా కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50, విజయవాడలో రూ.827.50గా ఉంది. హైదరాబాద్‌లో మాత్రం పై అన్ని నగరాల్లో కంటే అత్యధికంగా రూ.855కు లభిస్తుంది.
మరోవైపు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా నాలుగో నెలలో కూడా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబైలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.62 పెరిగింది. ఆ తర్వాత రెండు మెట్రోలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర వరుసగా రూ.1,802, రూ.1,754.50గా మారింది. కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో రూ.61 పెరుగుదలతో రూ.1911.50కు చేరుకుంది. చెన్నైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.61.5 పెరిగి ఆ తర్వాత రూ.1964.50గా మారింది.గత నాలుగు నెలలుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.150కి పైగా పెరిగింది. నివేదికల ప్రకారం చూస్తే.. ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.156 పెరిగింది. కోల్‌కతాలో 4 నెలల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.155.5 పెరిగింది. ముంబైలో అత్యధికంగా పెరుగుదల కనిపించగా నాలుగు నెలల్లో రూ.156.5 ధరలు పెరిగాయి. మరోవైపు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నగరమైన చెన్నైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.155 పెరిగింది.