నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశంలో అనుకోని ఘటన జరిగింది. అధికారి తప్పిదం కారణంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాకు సంబంధించి అంశాలపై చర్చించేందుకు, సమీక్ష జరిపేందుకు ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డితో పాటుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి నెల్లూరు రూరల్ ఆర్డీవో ప్రత్యూష హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక కార్యక్రమం ప్రారంభంలో అందరినీ వేదిక మీదకు ఆహ్వానించే సమయంలో ప్రత్యూష.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని పిలవడం మర్చిపోయారు.
స్వాగతం పలికే కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డిలకు బొకేలు సమర్పించి ఆహ్వానం పలికిన ఆర్డీవో ప్రత్యూష.. ఎంపీ వేమిరెడ్డి పేరును మర్చిపోయారు. దీంతో అలిగిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వేదిక దిగి వెళ్లిపోయారు. మంత్రులు ఆనం, నారాయణ ఇద్దరూ వేదిక కిందకు వెళ్లి సముదాయించేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. మంత్రులను సైతం పట్టించుకోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రివ్యూ మీటింగ్‌లో పాల్గొనకుండా.. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో వేమిరెడ్డి వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది.
మరోవైపు 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టికెట్ విషయంలో తాను చెప్పిన వారికి కాకుండా వేరే వ్యక్తికి టికెట్ కేటాయించారనే అసంతృప్తితో వేమిరెడ్డి అప్పట్లో వైసీపీని వీడినట్లు ప్రచారం జరిగింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు కూడా వేమిరెడ్డి కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఎంపీగా, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతికి కోవూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో టీడీపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టగా.. వేమిరెడ్డి దంపతులు ఇద్దరూ కూడా గెలుపొందారు. ఇటీవల టీటీడీ బోర్డును ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం.. వేమిరెడ్డి ప్రశాంతికి టీటీడీ బోర్డులో స్థానం కల్పించింది.