ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూర్వీకుల ఇంటి కోసం దశాబ్దాలుగా అన్వేషిస్తోన్న సీజేఐ జస్టిస్ ఖన్నా

national |  Suryaa Desk  | Published : Mon, Nov 11, 2024, 10:20 PM

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని తన పూర్వీకుల నివాసం గురించి సీజే చాలా కాలం నుంచి అన్వేషిస్తున్నట్టు ఆయన సన్నిహితులు వెల్లడించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వెళ్లినప్పుడల్లా కత్రా షేర్‌సింగ్ ప్రాంతాన్ని జస్టిస్ ఖన్నా సందర్శిస్తుంటారని, అది ఆయనొక తీర్థయాత్ర లాంటిదని చెప్పారు. కాలక్రమంలో ఆ ప్రాంతంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నా కానీ, సీజేఐ మాత్రం ఆ ప్రదేశంలో తన తాతయ్య సరవ్ దయాల్ కట్టించిన ఇల్లు గురించి వెదుకుతుంటారట.


ప్రముఖ న్యాయవాది అయిన దయాల్‌.. బ్రిటిష్ ఇండియాలో రెండు ఇళ్లను కొనుగోలు చేశారు. జలియన్‌ వాలాబాగ్‌ సమీపంలోని కత్రా షేర్‌సింగ్ ప్రాంతంలో ఒకటి, హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీలో మరొకటి కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో పంజాబ్‌లోని ఇళ్లు అగ్నికి ఆహుతి కాగా.. కొన్నాళ్ల తరవ్ాత సరవ్ దానిని పునరుద్ధరించారు. జస్టిస్ ఖన్నా తనకు ఐదేళ్ల వయసున్నప్పుడు తండ్రితో కలిసి ఒకసారి ఆ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటితో పాటు డల్హౌసీ నివాసం ముందు కూడా బోర్డుపై బౌజీ అని రాసి ఉంటుంది.


ఆయన తాతయ్య మరణం తర్వాత 1970ల్లో అమృత్‌సర్ ఇంటిని అమ్మివేశారు. ఇన్నేళ్లలో ఆ ప్రాంతంలో పలు మార్పులు చోటుచేసుకుని.. కొత్త కొత్త నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. కానీ చిన్ననాటి ఆ జ్ఞాపకం మాత్రం జస్టిస్ ఖన్నా మదిలో అలాగే ఉండిపోయింది. అందుకే కత్రా షేర్‌సింగ్ ప్రాంతంలోని తన పూర్వీకుల ఇంటి కోసం ఇప్పటికీ అన్వేషిస్తున్నారు. అమృత్‌సర్ వెళ్లినప్పుడల్లా కత్రా ప్రాంతంలో ఆగి, ఆ ఇంటికోసం ఆయన వెతుకుతుంటారని సన్నిహితులు తెలిపారు.


న్యాయవాదిగా సేవలు అందించిన సరవ్ దయాల్‌.. జలియన్‌ వాలాబాగ్‌ దురంతం తర్వాత కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన కమిటీలో పనిచేసినట్లు తెలుస్తోంది. ఓ సందర్భంలో సీజేఐ తన తాతయ్య గురించి చెప్పుకొచ్చారు. వేసవి సెలవులకు వెళ్లినప్పుడల్లా వెంట పుస్తకాలు తీసుకురావద్దని తాతయ్య చెప్పేవారని, తాను చెప్పే విషయాలు పుస్తకాల్లో ఉండవనేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. సరవ్ దయాల్ పెద్ద కుమారుడు జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com