ఐటీ ల్యాండ్‌స్కేప్‌ను మార్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ డెవలపర్‌లు, GCCలు , HTD భాగస్వాములకు చెందిన CXOలతో ఫలవంతమైన చర్చ జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. కో-వర్కింగ్ స్పేస్‌లు, నైబరింగ్ హబ్‌లు, ఇంటిగ్రేటెడ్ ఐటి పార్కుల ద్వారా సౌకర్యవంతమైన నమూనాలను, ఉపాధి అవకాశాలను చర్చించామన్నారు. ఆవిష్కరణ, సహకారాన్ని పెంపొందించడానికి ఏపీ ప్రభుత్వం ఉత్తమమైన సౌకర్యాలు, ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. ప్రపంచ స్థాయి ఐటి పాలసీతో నాలెడ్జ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా ఉంచే భాగస్వామ్యాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బుధవారం రాత్రి సీఎం చంద్రబాబు GCCలు, HTD భాగస్వాములు CXOలతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఆయన ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవే కాదు.. మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా మంత్రివర్గ సమావేశాంలో ఆమోదించారు.