మద్యం బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపినట్లు, ఇప్పటికే ప్రత్యేక నిఘా బృందాలు రంగంలోకి దిగాయని ఎక్సైజ్ డీసీ డాక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. తెనాలిలోని ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఎక్సైజ్ పాలసీని పరిశీలించిన అనంతరమే ప్రభుత్వం రాష్ట్రంలో ఉత్తమమైన మద్యం పాలసీని తీసుకు వచ్చిందన్నారు. నెల రోజుల్లో 235 కేసులు నమోదు చేశామని, మద్యం అక్రమ అమ్మకందారులు 215 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒక వ్యక్తి వద్ద మూడు బాటిల్స్ కంటే మించి ఉండకూదదన్నారు.
మద్యం అక్రమ అమ్మకాలు చేసినా, ప్రోత్సహించినా ఆ దుకాణదారుడికి రూ.5 లక్షల పెనాల్టీ విధిస్తామని తెలిపారు. రెండోసారి కేసు నమోదైతే షాపు లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. గతంలో మద్యం ధరల భారం ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం అందుబాటు ధరలు ఉండటంతో అమ్మకాలు పెరిగాయన్నారు. బెల్ట్‌షాపులపై తనిఖీలకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ వి.అరుణకుమారి, సీఐ యం.యశోధరదేవి, ఎస్ఐలు, ఫణికుమార్, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.