రాష్ట్రంలో పర్యాటకరంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, ఏపీని టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని చెప్పారు. ఏటా పది శాతం అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక రంగాన్ని సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే పర్యాటక రంగ అభివృద్ధికి కీలక నిర్ణయాల తీసుకున్నట్లు వెల్లడించారు.
మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణ, పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుపై సహచర మంత్రులు, అధికారులతో పవన్ కల్యాణ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలి. కర్నూలు జిల్లా ఆదోని, దొండపాడు, ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం లాంటి ప్రాంతాల్లో విద్యార్థుల కోసం అడ్వెంచర్ థీమ్ పార్క్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎకో టూరిజానికి సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాం’’ అన్నారు.