ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సూర్యకాంత్ లకు ఇటీవల ఓ విమాన ప్రయాణంలో ఊహించని అనుభవం

national |  Suryaa Desk  | Published : Wed, Nov 27, 2024, 11:14 PM

సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సూర్యకాంత్ లకు ఇటీవల ఓ విమాన ప్రయాణంలో ఊహించని అనుభవం ఎదురైంది. ఓ జడ్జి కుమారుడి పెళ్లికి హాజరైన కోయంబత్తూరు నుంచి ఢిల్లీ తిరిగి వచ్చేందుకు వారు విమానం ఎక్కారు. అయితే, అదే విమానంలో ఇద్దరు మందుబాబులు కూడా ఉండడం ఆ న్యాయమూర్తులను తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది. వారు విమానం ఎక్కింది ఆదివారం రాత్రి కాగా, మరుసటి రోజు సోమవారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు చాలా కేసులు ఉన్నాయి. దాంతో, ఆ ఇద్దరు జడ్జిలు తమ ఐప్యాడ్లలో వివిధ కేసులకు సంబంధించి ప్రిపేర్ అవ్వాలని భావించారు. కోయంబత్తూరు నుంచి ఢిల్లీకి మూడు గంటల ప్రయాణం కాగా, ఈ సమయాన్ని కేసుల గురించి సన్నద్ధమయ్యేందుకు ఉపయోగించుకోవాలని అనుకున్నారు. అయితే, ఆ విమానంలో ఇద్దరు మందుబాబులు మద్యంమత్తులో రచ్చ చేశారు. ఒక మందుబాబు టాయిలెట్లో దూరి తలుపేసుకున్నాడు. అరగంట నుంచి ఇతర ప్రయాణికులు తలుపు తెరవాలని చెబుతున్నా అతడు లోపలే ఉండిపోయాడు. మరో మందుబాబు టాయిలెట్ బయట వాంతి చేసుకోవడం ప్రారంభించాడు. జడ్జిలతో సహా, ఆ దృశ్యాలు చూసిన వాళ్లకు వాంతి వచ్చినంత పనైంది. చివరికి ఎలాగోలా టాయిలెట్ తలుపు తెరిస్తే... మద్యం మత్తులో ఉన్న వ్యక్తి గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు. విమాన సిబ్బంది ఆ మందుబాబును టాయిలెట్ నుంచి బయటికి తీసుకువచ్చారు. ఇదంతా సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సూర్యకాంత్ ల కళ్ల ఎదుటే జరిగింది. ఈ విషయాన్ని జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్వయంగా సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ వెల్లడించారు. ఈ కేసు కూడా విమానంలో ఓ మందబాబు వికృత చర్యకు సంబంధించినదే. గతంలో... న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు వృద్ధురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఆ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన పట్ల ఆ వృద్ధురాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెండేళ్ల కిందట దాఖలైన ఈ పిటిషన్ పై తాజాగా విచారణ సందర్భంగా జస్టిస్ కేవీ విశ్వనాథన్ విమానంలో తమకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com