వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పీఏగా పనిచేసిన గొండు మురళి నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. వైద్యారోగ్య శాఖ ఉద్యోగిగా ఉన్న మురళి ధర్మాన పీఏగా పనిచేశారు. మురళీ నివాసంతో పాటు విధులు నిర్వహించిన చోట, బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మురళి సొంత ఊరు జలుమూరు మండలం లింగన్నాయుడుపేటలోని ఇంట్లో తనిఖీలు జరిగాయి. మురళీ పనిచేస్తున్న సారవకోట మండలం బుడితి సీహెచ్‌సీలో సోదాలు చేశారు. మురళి అత్తవారి ఊరు కోటబొమ్మాళి మండలం దంతలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.. అక్కడ కూడా తనిఖీలు చేశారు. శ్రీకాకుళం, గాజువాక, మధురవాడ ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లల్లో కూడా తనిఖీ చేశారు.
మురళి 20 ఎకరాలకు పైగా భూమి.. విశాఖ, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్లు, ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు కిలో బంగారు ఆభరణాలు, 11.36 కిలోల వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ రూ.70 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మురళిని అదుపులోకి తీసుకుని విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
ధర్మాన కృష్ణదాస్ పీఏగా చేరకముందు గొండు మురళి సారవకోట మండలం బుడితి సీహెచ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహించారు. గతంలోనే ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయనే ప్రచారం ఉంది. ఏపీ ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బుడితి సీహెచ్‌సీలో ఉద్యోగం చేస్తున్నారు. తాజాగా ఆయన అక్రమాస్తులు కూడబెట్టారనే ఫిర్యాదు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.. భారీగా ఆస్తుల్ని గుర్తించారు. ఈ ఆస్తులన్నీ అతని పేరుతోనూ, అతని బంధువుల పేరుతోనూ కూడబెట్టుకున్నట్లుగా తేలింది. ఇటీవల విశాఖపట్నంలో కూడా మరో ప్రభుత్వ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి భారీగా అక్రమాస్తుల్ని గుర్తించిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్రలో వరుసగా ఇద్దరు ప్రభుత్వ అధికారులు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ కావడం చర్చనీయాంశం అయ్యింది.