ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర సీఎం రేసులోకి కొత్త వ్యక్తి.. అనూహ్యంగా తెరపైకి కేంద్రమంత్రి పేరు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 10:30 PM

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు దాటిపోతున్నా.. ఇంకా కొత్త ప్రభుత్వ ఏర్పాటు మాత్రం సాగడం లేదు. సీఎం పీఠంపై ఎవరు కూర్చుంటారు అనే క్లారిటీ రాకపోవడంతో.. ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యం అవుతోంది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షాతో మహాయుతి కూటమి నేతలైన దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు భేటీ అయిన తర్వాత సీఎం ఎవరు అనే అధికారిక ప్రకటన వస్తుందని భావించినా అది జరగలేదు. ఆ తర్వాత ఈ ముగ్గురు నేతలు.. ముంబైలో మరోసారి భేటీ అయి.. ప్రకటన చేస్తారనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ సమావేశాన్ని ఆకస్మికంగా రద్దు చేసుకున్న ఏక్‌నాథ్ షిండే.. తన సొంత ఊరికి వెళ్లిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేసులోకి మరో కొత్త వ్యక్తి పేరు వచ్చింది.


మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించడంతో ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు ముగ్గురూ సీఎం పదవిపై కన్నేశారు. అయితే బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం, ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండటంతో.. తక్కువ సీట్లు వచ్చిన అజిత్ పవార్.. సీఎం రేసు నుంచి తప్పుకుని.. దేవేంద్ర ఫడ్నవీస్‌కే మొగ్గు చూపినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య సీఎం సీటు కోసం గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీని కారణంగానే మహారాష్ట్ర అసెంబ్లీ గడువు పూర్తయినా.. కొత్త ప్రభుత్వం ఏర్పడి, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయడం ఆలస్యం అవుతుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.


ఈ నేపథ్యంలోనే సీఎం రేసులోకి కొత్త వ్యక్తి పేరు రావడం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన పూణే ఎంపీ, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయక మంత్రి మురళీధర్ మోహోల్ పేరు తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దేవేంద్ర ఫడ్నవీస్‌ను కాకుండా మురళీధర్ మోహోల్‌ను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.


అయితే ఈ సోషల్ మీడియా ఊహాగానాలపై స్వయంగా కేంద్రమంత్రి మురళీధర్ మోహోల్ స్పందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తన పేరును పరిశీలిస్తున్నట్లు.. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలు నిరాధారమైనవని.. కల్పితమని తేల్చి చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోరాడిందని.. మహారాష్ట్ర ప్రజలు కూడా చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియా ఊహాగానాల ద్వారా కాకుండా బీజేపీలో పార్లమెంటరీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ఒకసారి పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటే.. ఆ నిర్ణయమే తుది నిర్ణయం అని తెలిపారు. అందుకే సోషల్ మీడియాలో మహారాష్ట్ర సీఎం పదవికి తన పేరు వచ్చిందన్న ఊహాగానాలు అర్థరహితమని మురళీధర్ మోహోల్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com