హైదరాబాద్ నగరానికి నిత్యం వందల మంది ఉపాధి కోసం వస్తుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు తమ కార్యాలయాలను తెరుస్తున్న క్రమంలో నైపుణ్య వంతులకు మంచి డిమాండ్ ఉంది. అందులో చాలా మంది భాగ్యనగరంలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో నగర శివార్లలో కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఔటర్ సమీపంలో చందానగర్ శ్రీదేవి థియేటర్ రహదారి నుంచి అమీన్‌పూర్ రోడ్డు వైపు చూస్తే కాలనీలు విస్తరిస్తున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు ఓఆర్ఆర్ సమీపంలోని చందానగర్, అమీన్‌పూర్ వైపు చూస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్లు, భూములు కొంటున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో గిరాకీ పెరిగింది.
చందానగర్ నుంచి అమీన్‌పూర్ వరకు రోడ్డును 150 అడుగులకు విస్తరించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. దీంతో కొత్తగా ఇళ్లు కొనేవారు ఈ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే ఈ రోడ్డుకు ఇరువైపుల దుకాణాలు, కాంప్లెక్సులు వెలిశాయి. నాలుగు సంవత్సరాల క్రితమే ఈ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన జరిగింది. దీంతో ఇక్కడి ఇళ్లు, భూములకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఇళ్ల స్థలాలు గజం రూ.1 లక్ష వరకు పలుగుతున్నాయి. ఇక 40 అడుగుల రోడ్లు ఉన్న కాలనీల్లో గజం ధర రూ.1.5 లక్షలకుపైమాటే. చందానగర్, గంగారం ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్లాట్లు, ప్లాట్లు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ఉపాధి కోసం కొత్తగా నగరానికి వస్తున్న ఉద్యోగులు ప్రధానంగా ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న వారు ఈ ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు. దీంతో ఇక్కడ అద్దె ఇళ్లకు గిరాకీ పెరిగింది. రెండు పడక గదుల ఇంటికి అద్దె కనీసం రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఉంది. పార్కింగ్ సౌకర్యాలు ఉన్న ఇళ్లకు అయితే అద్దె రూ.12-15 వేల వరకు పలుకుతోంది. ఇక మూడు పడక గదుల ఇళ్లకు అయితే నెలకు రూ.15- 25 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అపార్ట్‌మెంట్లలో డబుల్ బెడ్ రూం ఫ్లాట్స్‌లో నిర్వహణ ఖర్చుతో కలిపి రూ.15-18 వేల వరకు అవుతోంది. అదే త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అయితే రూ.20 వేలకుపైనే అద్దె, ఖర్చులు చెల్లించాల్సి వస్తోంది.