ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే ఛార్జీలు పెంచే యోచనలో కేంద్రం..

national |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 01:02 PM

రానున్న బడ్జెట్ సమావేశంలో రైల్వే ఛార్జీలను పెంచేందుకు కేంద్రం సిద్ధమయ్యిందా? ఏయే తరగతులు పెంచాలని భావిస్తోంది? కేవలం ఏసీ తరగతులకు మాత్రమేనా? లేక సాధారణ తరగతులపై కన్నేసిందా? దీనికి సంబంధించి పార్లమెంట్ పానెల్ కమిటీ ఎలాంటి సూచనలు చేసింది? స్టోరీపై ఓ లుక్కేద్దాం. పార్లమెంటు ఎన్నికలు పూర్తి కావడంతో ఆదాయం పెంచుకునే లక్ష్యంతో అడుగులు వేస్తోంది మోదీ సర్కార్. ఇప్పటికే కొన్ని రకాల వస్తువులకు జీఎస్టీని తగ్గించాలని వివిధ సెక్టర్ల నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో ఎటువైపు ఛార్జీలు వడ్డించాలా అనేదానిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆశా కిరణంగా కనిపించింది రైల్వేలు. బడ్జెట్‌లో రైల్వే ఛార్జీలు పెంచడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పార్లమెంట్ ప్యానెల్ సైతం ఛార్జీలు పెంచాలనే నివేదిక ప్రభుత్వానికి ఇచ్చినట్టు ఢిల్లీ సమాచారం. ఏసీ ఛార్జీలను పెంచాలని సూచన చేసింది. మిగతా విభాగాల జోలికి వెళ్లకూడదన్నది అందులోని సారాంశం. సాధారణ తరగతికి రైల్వేలు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొంది. రైల్వేపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేసింది. ప్రయాణీకుల విభాగంలో నష్టాలను తగ్గించడానికి ఎయిర్ కండిషన్డ్ తరగతి ఛార్జీలను సమీక్షించాలని సిఫార్సు చేసింది. సాధారణ తరగతి ప్రయాణం సరసమైనదిగా ఉండేలా చేసింది. 2024-25 బడ్జెట్ అంచనాలను సరకు రవాణా ద్వారా రూ. 1.8 లక్షల కోట్లతో పోలిస్తే ప్రయాణీకుల ఆదాయం రూ. 80,000 కోట్లుగా అంచనా వేసింది. రాబడులను పెంచుకోవాలంటే ప్రయాణికుల విభాగం ఒక్కటే మార్గమని అంచనా వేసింది. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ ఖర్చులపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని, టిక్కెట్ ధరల స్థోమత ఉండేలా ఈ ఖర్చులను హేతుబద్ధం చేయాలన్నది ఆ కమిటీ రైల్వేను కోరింది. దీనికి సంబంధించి శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో నివేదికను సమర్పించింది. రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణకు మూలధన పెట్టుబడులు అవసరమన్నది కమిటీ ఆలోచన. మౌలిక సదుపాయాల మెరుగుదలకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, దాని కారణంగా ప్రణాళికా వ్యయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కమిటీ భావిస్తోంది. ఇటీవల బయటపడుతున్న క్యాటరింగ్ సేవల్లో అసమర్థతలను ప్యానెల్ హైలైట్ చేసింది, ఆర్థిక పని తీరును మెరుగుపరచడానికి పలు సిఫార్సు చేసింది. క్యాటరింగ్‌కు సంబంధించిన సామాజిక సేవా బాధ్యతల ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటూ, పోటీ ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించింది. మరోవైపు సీనియర్ సిటిజన్‌కు రాయితీలు ఇవ్వాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి క్రమంగా పెరుగుతోంది. ప్రతి టికెట్‌పై 46% తగ్గింపుతో సహా ఏటా రూ. 56,993 కోట్ల రాయితీలు, సీనియర్ సిటిజన్ రాయితీలను పునరుద్ధరించడం అసంభవమని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తిగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com