ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపూర్‌ వెళ్లేందుకు విదేశీయులకు అనుమతి లేదా?

national |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2024, 08:42 PM

ఈశాన్య భారతదేశంలోని కీలక రాష్ట్రమైన మణిపూర్‌లో గత కొద్ది నెలలుగా హింసాత్మక పరిస్థితులు, ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిపూర్‌తోపాటు మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లోకి విదేశీయుల ప్రవేశంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ ప్రచారం మొదలైంది.


క్లెయిమ్ ఏంటి?


తదుపరి నోటీసు వచ్చేవరకు విదేశీ పౌరులు ఎవరూ మణిపూర్‌లో ప్రయాణించడానికి అనుమతించరు. ప్రస్తుతం మణిపూర్‌లో ఉన్న విదేశీ పౌరులు తక్షణమే రాష్ట్రం విడిచి వెళ్లాలని కోరారు. మిషనరీలపై భారత ప్రభుత్వం భారీ చర్య’ అంటూ అక్షిత్ సింగ్ (X/IndianSinghh) అనే యూజర్ డిసెంబర్ 21న ఎక్స్‌లో పోస్టు చేశారు.


అసలు వాస్తవమేంటి..?


మణిపూర్‌తోపాటు మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రొటెక్టెడ్ ఏరియా రెజిమె లేదా ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ (రక్షిత ప్రాంత అనుమతి)ని కేంద్రం మళ్లీ విధించిందని మణిపూర్ ప్రభుత్వం డిసెంబర్ 18న ప్రకటించింది. దీంతో 13 ఏళ్ల రక్షిత ప్రాంత అనుమతి ఆంక్షలు తిరిగి అమల్లోకి వచ్చినట్లయ్యింది. ఈ మూడు రాష్ట్రాలు మయన్మార్‌తో సరిహద్దును పంచుకుంటున్నవే కావడం గమనార్హం. మణిపూర్‌లోని సంఘర్షణలకు మయన్మార్ నుంచి రాష్ట్రంలోకి కొనసాగుతున్న అక్రమ వలసలు ప్రధాన కారణాల్లో ఒకటని మణిపూర్ బీజేపీ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు జాతీయ మీడియాకు చెందిన వెబ్‌సైట్లలో కథనాలు కనిపించాయి.


ప్రొటెక్టెడ్ ఏరియా రెజిమీ ఆంక్షలు తిరిగి అమల్లోకి రావడంతో.. మణిపూర్‌ను సందర్శించే విదేశీయుల కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తారు. అంతే కాకుండా.. ఫారినర్స్ (రక్షిత ప్రాంతాలు) ఆర్డర్, 1958 ప్రకారం అవసరమైన రక్షిత ప్రాంత అనుమతి (PAP)ని మణిపూర్‌ను సందర్శించే విదేశీయులు తీసుకోవాల్సి ఉంటుంది.


ఫారినర్స్ (రక్షిత ప్రాంతాలు) ఆర్డర్, 1958 ప్రకారం, విదేశీ పౌరులు భారతదేశంలో.. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలోని నిర్దేశిత ప్రాంతాల్లో ప్రవేశించడానికి తప్పనిసరిగా PAPని పొందాలి. పర్యాటకాన్ని పెంపొందించే ఉద్దేశంతో 2010లో కేంద్రం మణిపూర్, నాగాలాండ్‌లలో రక్షిత ప్రాంత అనుమతిని ఎత్తేసింది. అయితే చైనా, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్‌ సంతతికి చెందిన వారు మాత్రం ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించేందుకు ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే. 2010లో ఆంక్షలు ఎత్తేసిన తర్వాత.. ఈ ఆర్డర్‌ను ఎప్పటికప్పుడూ పొడిగిస్తూ వస్తున్నారు. చివరగా 2022 డిసెంబర్ 16న పొడిగించగా.. 2027 డిసెంబర్ వరకు ఈ ఆర్డర్ అమల్లో ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం తిరిగి ఆంక్షలు విధించింది.


కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ఈ ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం సంతృప్తి చెందే కారణం చెప్పలేకపోతే.. రక్షిత ప్రాంతాన్ని సందర్శించడానికి విదేశీయులకు అనుమతి లభించదు. కేంద్రం ఇచ్చే పర్మిట్‌తో రక్షిత ప్రాంతాల్లోని ఏయే ప్రాంతాలను సందర్శించొచ్చనే విషయాన్ని కూడా మార్గదర్శకాల్లో పేర్కొంటారు. టూరిజం కాకుండా ఇతర కారణాల వల్ల ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ కావాల్సి వస్తే.. కేంద్ర హోం శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి.


మణిపూర్ టూరిజం వెబ్‌సైట్లో పేర్కొన్న అంశాలు:


* మణిపూర్‌ను సందర్శించే విదేశీయులు ఇంఫాల్‌లోని సీఐడీ ఆఫీస్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంఫాల్‌లోని హోటల్‌లో రాత్రి బస చేస్తే.. రిజిస్ట్రేషన్ కోసం ఫార్మాలిటీస్ పూర్తి చేయడంలో హోటళ్లు సహకరిస్తాయి.


* నాగాలాండ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మణిపూర్ సందర్శించే విదేశీయులు మావో గేట్ చెక్ పోస్ట్ దగ్గర ఇమ్మిగ్రేషన్ చెక్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు.


* వాయు మార్గంలో మణిపూర్ సందర్శించే విదేశీయులు ఇంఫాల్‌లోని బిర్ తికెంద్రజిత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.


ఇది నిజం


రక్షిత ప్రాంత అనుమతి ఆంక్షలు అమల్లోకి రావడం వల్ల విదేశీయులు ప్రభుత్వం నుంచి అనుమతి (పీఏపీ) తీసుకొని మణిపూర్‌లో పర్యటించొచ్చు. అయితే అన్ని ప్రాంతాలను వీరు సందర్శించలేరు. అసలు మణిపూర్‌లో ప్రయాణించడానికి విదేశీయులను అనుమతించరు అనే ప్రచారం నిజం కాదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa