ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఫార్చూన్ ఆయిల్‌'కు అదానీ గుడ్‌బై.. రూ.17 వేల కోట్లకు వాటా విక్రయం!

business |  Suryaa Desk  | Published : Mon, Dec 30, 2024, 09:55 PM

దేశీయ వంట నూనెల మార్కెట్లో ఫార్చూన్ ఆయిల్ అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ఫార్చూన్ బ్రాండ్‌పై వివిధ రకాల వంట నూనెలు, వంట సరుకులు మార్కెట్లో ఉంటాయి. అయితే, వీటిని తయారు చేసేందుకు అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అని చాలా మందికి తెలియదు. సింగపూర్‌కు చెందిన విల్మర్ ఇంటర్నేషనల్‌ భాగస్వామ్యంతో అదానీ విల్మర్ లిమిటెడ్ (Adani Wilmar Ltd) జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసి ఫార్చూన్ బ్రాండ్‌పై వంట నూనెలు, సరకులు విక్రయిస్తున్నారు. తాజాగా అదానీ విల్మర్ నుంచి అదానీ గ్రూప్ నిష్క్రమించాలని నిర్ణయించింది. ఆ కంపెనీలో తమ పూర్తి వాటాలను విక్రయించనున్నట్లు అదానీ ఎంటర్ ప్రైజెస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.


అదానీ విల్మర్ లిమిటెడ్ కంపెనీలో అదానీ ఎంటర్ ప్రైజెస్‌కు ప్రస్తుతం 43.97 శాతం, విల్మర్ ఇంటర్నేషనల్‌కి 43.97 శాతం వాటాలు ఉన్నాయి. అయితే తమకున్న వాటాలో 31.06 శాతం వాటాను విల్మర్ ఇంటర్నేషనల్‌కి విక్రయిస్తామని అదానీ తెలిపింది. మిగిలిన 13 శాతం వాటాను కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ కోసం బహిరంగ మార్కెట్లో విక్రయించాలని నిర్ణయించినట్ల తెలిపింది. అయితే, వాటి ధర ఎంత అనేది వెల్లడించలేదు. కానీ, ఈ సేల్ విలువ 2 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. అంటే భారత దేశ కరెన్సీలో సుమారు రూ.17 వేల కోట్లకుపైగా ఉంటుంది.


2025, మార్చి 31కి ముందే వాటా విక్రయం పూర్తి చేయనున్నట్లు అదానీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత జాయింట్ వెంచర్ బోర్డు నుంచి తాము నామినేట్ చేసిన డైరెక్టర్లు సైతం పదవి నుంచి వైదొలుగుతారని అదానీ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. వాటా విక్రయం కోసం దాదాపు ఏడాదికిపైగా చర్చలు జరిగినట్లు సమాచారం. అదానీ గ్రూప్ పోర్టుల నుంచి ఇంధనం వరకు వివిధ రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తోంది. అయితే, ఎఫ్ఎంసీజీ రంగం నుంచి పూర్తిగా వైదొలిగి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాలపైనే దృష్టి సారించాలని అదానీ గ్రూప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భారత వంట నూనెల మార్కెట్లో అదానీ విల్మర్‌కు అత్యధిక వాటా ఉంది. ఫార్చూన్ బ్రాండ్ పేరుతో వంట నూనెలు, సరకలు విక్రయిస్తున్నారు. ఫార్చూన్ బ్రాండ్‌కు మంచి డిమాండ్ ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com