తన కుమార్తెకు తెలివి తక్కువగా ఉందని.. అంతేకాకుండా ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చింది కాబట్టి.. గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడో తండ్రి. అయితే అందుకు తన కూతురు ఏమాత్రం ఒప్పుకోవడం లేదని కూడా వివరించాడు. అది విన్న హైకోర్టు.. తెలివి తక్కున ఉన్నంత మాత్రానా ఆ యువతికి తల్లి అయ్యే హక్కు లేదా అని అతడిని ప్రశ్నించింది. మానస్థిక స్థితి సరిగ్గా లేనంత మాత్రాన పిల్లలను కనకూడదని చెప్పడం చట్ట విరుద్ధమని పేర్కొంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
27 ఏళ్ల వయసు కల్గిన ఓ యువతి ఇటీవలే గర్భం దాల్చింది. అయితే ఆమె మానసిక పరిస్థితి అంతంత మాత్రమే. ఎక్కువగా తెలివి లేదు. అయితే పెళ్లికి ముందే ఆమె గర్భం దాల్చడంతో.. ఆమె తండ్రి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తన కూతురు గర్భస్రావానికి అనుమతి కావాలని కోరాడు. ముఖ్యంగా తన కూతురుకు పెద్దగా తెలివి లేదని, పెళ్లి కాకుండానే గర్భం దాల్చినందును ఆమెకు అబార్షన్ చేయించాలనుకున్నట్లు వివరించారు. ఇది విన్న బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఐక్యూ లెవెల్ తక్కువగా ఉన్నంత మాత్రానా ఆమెకు తల్లి అయ్యే అవకాశం లేదా అని ప్రశ్నించింది.
తెలివి తక్కువగా ఉండడం వల్ల తల్లిదండ్రులు కావొద్దని చెప్పడం చట్ట విరుద్ధం అని న్యాయస్థానం వివరించింది. అందులోనూ సదరు యువతి తాను తల్లి కావాలని భావిస్తున్నందున.. గర్భస్రావం చేయించే వీలు లేదని జస్టిస్ ఆర్‌వీ ఘూగే, జస్టిస్ రాజేశ్ పాటిల్‌తో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇటీవలే వచ్చిన ఈ పిటిషన్‌పై.. యువతి మానసిక పరిస్థితి ఎలా ఉందో నివేదిక ఇవ్వాలంటూ ముంబయిలోని జేజే ఆస్పత్రికి సూచనలు జారీ చేసింది. ఈక్రమంలోనే ఆస్పత్రి యాజమాన్యం బుధవారం రోజు సదరు యువతి మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి రిపోర్టు ఇచ్చింది.
సాధారణం కంటే ఆమె ఐక్యూ లెవెల్స్ కాస్త తక్కువగా ఉన్నాయని.. ముఖ్యంగా 75 శాతం మాత్రమే ఆమెకు ఐక్యూ ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం 21 వారాల గర్భం కల్గిన యువతి.. తల్లి అయ్యేందుకు శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉందని కూడా వివరించింది. ఇదంతా విన్న ధర్మాసనం ఆమెకు అబార్షన్ చేయించడానికి వీలు లేదని తెగేసి చెప్పింది. అలాగే ఆమె ఎవరి వల్ల గర్భం దాల్చిందో ఇప్పటికే తల్లిదండ్రులకు చెప్పింది కాబట్టి, వారిద్దరూ మేజర్లు కాబట్టి అతడితో మాట్లాడి వారిద్దరికీ పెళ్లి చేయాలని సూచించింది.
ఒకవేళ సదరు యువకుడు పెళ్లికి ఒప్పుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాడనికి తాము సిద్ధం అని బాంబే హైకోర్టు వెల్లడించింది. అలాగే కుస తదుపరి విచారణను జనవరి 13వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపే అమ్మాయితో పెళ్లి గురించి సదరు యువకుడితో మాట్లాడాలని సూచించింది.