యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్కిల్ సెన్సస్‌ను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ కార్యక్రమాన్ని మరింత ప్రయోజనకరంగా చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. ఎటువంటి ఆర్థికవనరులతో సంబంధం లేకుండానే స్కిల్ సెన్సస్‌లో భాగంగా జనరేటివ్ ఏఐని ఉపయోగించి అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించేందుకు ఇన్ఫోసిస్ అంగీకారం తెలిపింది. దీంతో ఇన్ఫోసిస్, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) మధ్య రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ సెన్సస్ డాటా ప్రివాలిడేషన్‌కు ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.దీని ద్వారా రాష్ట్రంలో యువత ప్రస్తుత నైపుణ్యాలను అంచనా వేసి, మార్కెట్ డిమాండ్‌కు తగ్గట్టుగా వారికి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇవ్వడానికి మార్గం సులభతరం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యసాధనలో భాగస్వామి కావడానికి ఇన్ఫోసిస్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులు సంతోష్, తిరుమల, స్కిల్ డెవలప్ మెంట్ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్‌మెంట్ ఉన్నతాధికారులు గణేష్ కుమార్, దినేష్ కుమార్, రఘు హాజరయ్యారు.