రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగించేలా ప్రతినెలా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని మంత్రి ఎస్.సవిత తెలిపారు. గురువారం విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్‌పోను మంత్రి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వీవర్స్ సర్వీస్ సెంటర్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్స్‌పోను వారం పాటు నిర్వహిస్తున్నామన్నారు. సంక్రాంతికి ప్రజలంతా చేనేత వస్ర్తాలు కొనుగోలు చేసి ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. గడిచిన 6 నెలల్లో మూడు ఆప్కో షోరూంలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మరికొన్ని ప్రారంభిస్తామ ని తెలిపారు. రాష్ట్రంలో 10 క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు ఆదిత్య బిర్లా గ్రూపు సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. చేనేత వస్ర్తాల అమ్మకాలతో నేతన్నలకు 365 రోజులు పాటు పని కల్పించేలా టాటా సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. త్వరలో 5 శాతం జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌కు చర్యలు తీసుకుంటామన్నారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని మంత్రి తెలిపారు. ఆప్కో ఎండీ పావనమూర్తి, వీవర్స్ సర్వీస్ సెంటర్ డీడీ సాహు పాల్గొన్నారు.