ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బిజీబిజీగా గడిపారు. ఓవైపు కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూనే.. మరో వైపు సొంతూరి అభివృద్ధికి పలు శంకుస్థాపనలు చేశారు. పండుగ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ దంపతులు గ్రామంలో మహిళలకు, పిల్లలకు ఏర్పాటు చేసిన పలు రకాల పోటీలను తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. గతేడాది సోదరుడు రామ్మూర్తినాయుడి మృతితో ఈ పర్యాయం సంక్రాంతికి చంద్రబాబు కుటుంబం స్వగ్రామానికి వస్తుందో రాదోనని అందరూ అనుకున్నారు. అయితే పండుగ జరుపుకొన్నా జరుపుకోకపోయినా ఆనవాయితీ ప్రకారం వచ్చారు. చంద్రబాబు, లోకేశ్ దంపతులతో పాటు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, వారి చిన్న కుమార్తె తేజస్విని, అల్లుడు ఎంపీ భరత్‌లతో పాటు సన్నిహిత బంధువులు వచ్చారు.