డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం ప్రధాన కాలువలో మూడు రోజులపాటు నిర్వహించిన డ్రాగన్ పడవ పోటీలు సోమవారం ఘనంగా ముగిశాయి. సర్‌ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలిరాగా, మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీలను ప్రారంభించారు. ఫైనల్ పోటీలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. పల్నాడు ఫాంథర్స్, జంగారెడ్డిగూడెం జెయింట్స్, ఎన్టీఆర్ ఈగల్స్ ఫైనల్స్‌కు చేరుకోగా, పోటీ హోరాహోరీగా సాగింది. జంగారెడ్డిగూడెం, పల్నాడు టీమ్‌లు విజేతలుగా నిలిచాయి. రెండు జట్లకు చెరో రూ.లక్ష, ట్రోఫీలు, సర్టిఫికెట్లు, మెడల్స్‌ను అందజేశారు. తృతీయస్థానంలో నిలిచిన ఎన్టీఆర్ ఈగల్స్ జట్టుకు రూ.30వేలు ఇచ్చారు. రంగవల్లులు, పతంగుల పోటీల్లో విజేతలకు నగదు బహుమతి అందజేశారు. పోటీలను ఆర్గనైజ్ చేసిన దండు శివను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సత్కరించారు.