ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైఫ్ అలీ ఖాన్‌పై దాడిచేసింది ఎవరు? ఆరెస్సెస్‌ కార్యకర్తా..?

national |  Suryaa Desk  | Published : Fri, Jan 17, 2025, 08:31 PM

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన సంచలనం సృష్టించింది. సైఫ్ నివాసంలోనే దుండగుడు ఆయనపై కత్తితో దాడిచేసి హత్యాయత్నం చేయడం అభిమానులను, సెలబ్రిటీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే, నిందితుడి అరెస్టుకు ముందే సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడు ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడని కొంత మంది పోస్టులు (ఇక్కడ, ఇక్కడ) చేస్తున్నారు. ఈ వాదనలో నిజమెంత? ఇప్పుడు తెలుసుకుందాం..


యూజర్ల వాదనలు ఏంటి?


ముస్లిం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను ఆరెస్సెస్‌ కార్యకర్త కత్తితో 6 సార్లు పొడిచాడు. ఆయణ్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఎక్స్‌ (ట్విట్టర్)లో @preetikaur69 అనే ఖాథా నుంచి జనవరి 16న ఈ పోస్టు చేశారు. ‘భారత్‌లో ముస్లింల పరిస్థితి!’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు.


Bangladesh 2.0 అనే పేరు గల అకౌంట్ నుంచి కూడా ఇవే వ్యాఖ్యలతో ఈ పోస్టు చేశారు. ఎక్స్‌లో, ఫేస్‌బుక్‌లో చాలా మంది యూజర్లు ఇవే ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. కాషాయ వస్త్రాలు ధరించిన ఓ గుంపు కత్తులు చేతబట్టుకొని పరుగెత్తుకొస్తున్నట్లుగా ఉన్న ఓ ఫోటోను సైఫ్ అలీ ఖాన్ ఫోటోతో జతచేసి పెట్టారు.


సైఫ్‌పై కత్తితో దాడి చేసింది ఎవరు?


గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో తన నివాసంలో నిద్రిస్తున్న సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది. ఆ తర్వాత ఆయణ్ని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ దాడి గురించి సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు.


అయితే, ఇప్పటివరకు దాడి చేసిన వ్యక్తి ఫోటో మాత్రమే బయటకు వచ్చింది. సైఫ్ నివాసంలోని 6వ అంతస్తులో సీసీ కెమెరాలో రికార్డైన విజువల్స్‌లో నిందితుడిని గుర్తించి ఫోటోను విడుదల చేశారు పోలీసులు. అంతేగానీ, అతడు ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, ఎవరికి మద్దతు ఇస్తాడు.. ఇలాంటి సమాచారమేదీ వెలుగులోకి రాలేదు.


దాడి చేసిన వ్యక్తికి సంబంధించిన సమాచారం కోసం మేం (సజగ్ టీమ్) గూగుల్‌లో శోధించగా.. సైఫ్‌పై దాడిచేసింది ఒక దొంగ అని అన్ని ప్రధాన మీడియా సంస్థలు తమ వార్తా కథనాల్లో పేర్కొన్నాయి. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే అతడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించాడని, కత్తి చూపించి బెదిరించాడని పలు కథనాల్లో రాశారు.


సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన సమయంలోనే ఓ వ్యక్తి బ్యాగు తగిలించుకుని ఇంట్లో మెట్లు దిగి వెళ్తున్న విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ విజువల్స్ ఆధారంగా అనుమానితుడి ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అలాగే, చిన్న వీడియో కూడా బయటికి వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం బాంద్రా పోలీసులు ఒక అనుమానితుడిని పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. దీంతో సైఫ్ అలీఖాన్‌పై దాడిచేసిన వ్యక్తి ఇతడేనని ప్రచారం జరిగింది. కానీ, ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదంటూ పోలీసులు ఆ తర్వాత ప్రకటించారు.


‘సైఫ్, ఇతర కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. దుండగుడు ఇంట్లోకి చొరబడి చిన్నకొడుకు జేహ్ నిద్రిస్తున్న గదిలోకి వెళ్లాడు. జేహ్‌కు కేర్‌టేకర్‌గా ఉన్న మహిళ.. అతడిని చూసి గట్టిగా అరవడంతో సైఫ్ అలీఖాన్ నిద్రలేచి పరుగెత్తుకొచ్చారు. దీంతో సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు’ అని పలు వార్తా కథనాలు నివేదించాయి.


ఈ దాడిలో సైఫ్ అలీఖాన్‌కు ఆరు చోట్ల కత్తిపోటు గాయాలయ్యాయి. రెండు లోతైన గాయాలయ్యాయి. మెడకు కాస్త కింది భాగంలో వెన్నెముకకు దగ్గరగా.. కత్తి విరిగి మొన శరీరంలోనే ఉండిపోయింది. లీలావతి హాస్పిటల్ వైద్యులు సర్జరీ చేసి ఆ కత్తిమొనను తొలగించారు. సైఫ్‌కు ప్రమాదమేమీ లేదని తెలిపారు.


నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 20 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బాంద్రా రైల్వేస్టేషన్‌ వద్ద అతడు చివరిసారి కనిపించాడని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత అతడు వసాయి-విరార్‌ ప్రాంతాల వైపు లోక్‌ల్‌ ట్రైన్‌లో ప్రయాణం చేసినట్లు అనుమానిస్తున్నారు.


సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడుతోందని లీలావతి ఆస్పత్రి వైద్యులు శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మారుస్తున్నట్లు తెలిపారు. ఆయన నడవగలుగుతున్నారని, ఆహారం తీసుకుంటున్నారని, మాట్లాడుతున్నారని చెప్పారు. ఇన్‌ఫెక్షన్స్‌ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని వారాల పాటు విశ్రాంతి సూచించినట్లు తెలిపారు.


ఇది వాస్తవం


సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి ఆరెస్సెస్‌ సభ్యుడు అనే వాదన తప్పుదారి పట్టించేది. దాడి చేసిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియలేదు. నిందితుడి గురించి పోలీసులు గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో కొంత మంది రెచ్చగొట్టేవిధంగా చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa