ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఆయన ఈరోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై రాళ్లను విసిరారు. రాళ్ల దాడిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ వేదికగా విమర్శించింది. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఆ పార్టీ ఆందోళనకు గురవుతోందన్నారు. అందుకే కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. కేజ్రీవాల్ ప్రచారం చేస్తుండగా బీజేపీకి చెందిన కొందరు కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారని వెల్లడించింది. ఇలాంటి చర్యలకు ఆమ్ ఆద్మీ పార్టీ భయపడదని స్పష్టం చేసింది. ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెబుతారని, ఇందుకు సంబంధించి రాళ్ల దాడి వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ పోస్ట్ చేసింది.ఈ ఘటనపై బీజేపీ కూడా స్పందించింది. కేజ్రీవాల్ కాన్వాయ్ ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టిందని, వీరిని ఆసుపత్రికి తరలించినట్లు బీజేపీ నేత పర్వేశ్ వర్మ తెలిపారు. కేజ్రీవాల్ ముందున్న ఓటమిని గురించి ఆలోచిస్తూ ప్రజల ప్రాణాలకు ఉన్న విలువను కూడా మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను కలిసేందుకు తాను ఆసుపత్రికి వెళుతున్నానన్నారు.