దేశం మొత్తం సంచలనంగా మారిన కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్ డాక్టర్ హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ని శనివారం దోషిగా తేల్చిన సీల్దా కోర్టు.. సోమవారం జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే అంతటి మృగాడికి జీవిత ఖైదు సరిపోదని.. ఉరిశిక్ష విధించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ కేసు తీర్పు సందర్భంగా.. సీల్దా కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అరుదైన కేసు కాదు అని తాను భావిస్తున్నానని.. అందుకే సంజయ్ రాయ్ మరణించేవరకు జైలులోనే ఉండాలని పేర్కొన్నారు. అయితే తీర్పు వెలువరించడానికి ముందు సీల్దా కోర్టు అదనపు జిల్లా అండ్ సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్.. సంజయ్ రాయ్‌కి ఒక అవకాశం ఇచ్చారు.
ఈ కేసు గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని సంజయ్ రాయ్‌ని అనిర్బన్ దాస్ ప్రశ్నించారు. దానికి స్పందించిన సంజయ్ రాయ్.. తాను నిర్దోషిని అని, తనతో డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకం చేయించుకున్నారని పేర్కొన్నాడు. ఏ కారణం లేకుండా తనను ఈ కేసులో ఇరికించారని సంజయ్ రాయ్ తెలిపాడు. తాను ఎల్లప్పుడూ రుద్రాక్ష గొలుసు ధరిస్తానని ముందే చెప్పానని.. ఒకవేళ తాను నేరం చేసి ఉంటే ఆ రుద్రాక్ష గొలుసు నేరం జరిగిన ప్రదేశంలో విరిగిపోయేదని చెప్పాడు. తనను పోలీసులు, సీబీఐ అధికారులు ఏమీ మాట్లాడనివ్వలేదని.. బలవంతంగా చాలా కాగితాలపై సంతకాలు చేయించుకున్నారని కోర్టుకు వివరించాడు.
ఇక సంజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలపై జడ్జి అనిర్బన్ దాస్ మాట్లాడారు. ఈ కేసు గురించి తనతో మాట్లాడేందుకు దాదాపు సగం రోజు సమయం ఇచ్చానని.. 3 గంటల పాటు చెప్పిన మాటలు విన్నానని పేర్కొన్నారు. తన ముందు అన్ని సాక్ష్యాధారాలు, అభియోగాలు ఉన్నాయని.. వాటిని పరిశీలించిన తర్వాత వాటి ఆధారంగానే దోషిగా తేల్చినట్లు చెప్పారు. అయితే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా నిన్ను కలిసేందుకు వచ్చారా అని ప్రశ్నించగా.. ఎవరూ తన దగ్గరకు రాలేదని సంజయ్ రాయ్ బదులిచ్చాడు.
ఇక ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కి ఉరిశిక్ష వేయాలని సీబీఐ తరఫు లాయర్ కోర్టుకు విన్నవించుకున్నారు. ఇది చాలా అరుదైన కేసు అని.. చనిపోయిన విద్యార్థిని ఎంతో ప్రతిభావంతురాలని కోర్టుకు చెప్పారు. ఈ హత్యాచార ఘటన సమాజాన్ని ఎంతో కలిచివేసిందని.. డాక్టర్లకే రక్షణ లేకపోతే.. ఇంకేం చేయాలని అడిగారు. ఇలాంటి కేసుల్లో దోషికి మరణశిక్ష విధిస్తేనే.. మరిన్ని ఘటనలు జరగవు అని ప్రజల్లో ఒక నమ్మకం వస్తుందని తెలిపారు. నవంబర్ 12వ తేదీ నుంచి ఈ కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసుపై సీల్దా కోర్టులో విచారణ జరుగుతుండగా.. దాదాపు 50 మంది సాక్ష్యాలను కోర్టు పరిశీలించింది. జనవరి 9వ తేదీన తుది విచారణ పూర్తి కాగా.. శనివారం సంజయ్ రాయ్ దోషి అని తేల్చి.. తాజాగా శిక్ష ఖరారు చేసింది.