ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ఆకర్షించే హామీలను గుప్పిస్తున్నాయి. ఇప్పటికే మేనిఫెస్టోను ప్రకటించిన బీజేపీ తాజాగా మరో మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే అర్హులైన విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని బీజేపీ తెలిపింది. పాలిటెక్నిక్, ఐటీఐలలో టెక్నికల్ కోర్సులు చేస్తున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు భీమ్ రావ్ అంబేద్కర్ స్టైఫండ్ పథకం కింద ప్రతి నెలా రూ. 1,000 చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తామని పేర్కొంది. యూపీఎస్సీ, స్టేట్ సివిల్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ. 15 వేల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ సంకల్ప్ పత్ర పార్ట్-2ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విడుదల చేశారు. ఆప్ హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాలు, అవినీతిపై సిట్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ చెప్పారు. సంకల్ప్ పత్ర పార్ట్-1ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవలే విడుదల చేశారు. గర్భిణీ స్త్రీలకు రూ. 21 వేల ఆర్థికసాయం, మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థికసాయం, పేద కుటుంబాలకు సబ్సిడీపై ఎల్పీజీ సిలిండర్లను రూ. 500కే అందించడం వంటివి తొలి మేనిఫెస్టోలో ఉన్నాయి. మరోవైపు బీజేపీ మేనిఫెస్టోపై ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందిస్తూ... బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులైన విద్యార్థులకు మాత్రమే ఉచిత విద్య లభిస్తుందా? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ప్రతి విద్యార్థికి ఉచిత విద్య లభిస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రజలు గమనించాలని అన్నారు.