దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఇఎఫ్) వార్షిక సదస్సు 2025 అట్టహాసంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు వివిధ దేశాల నాయకులు, అధికారులు, వ్యాపార వేత్తలు హాజరుకానున్నారు. జ్యురిచ్ కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8గంటల ప్రాంతంలో దావోస్ కాంగ్రెస్ సెంటర్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా హాజరైన పారిశ్రామికవేత్తలతో పెట్టుబడుల అవకాశాలు, పొటెన్షియల్ కొలాబరేషన్స్‌పై చర్చ జరిగింది. దావోస్ కాంగ్రెస్ సెంటర్ ప్లీనరీ హాలు లాబీలో ఏర్పాటుచేసిన నెట్ వర్కింగ్ డిన్నర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టిజి భరత్ హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు వివరించారు.