ఛత్తీస్ గఢ్ లోని దట్టమైన అడవులను తమ స్థావరంగా మార్చుకుని దశాబ్దాలుగా మనుగడ సాగిస్తున్న మావోయిస్టులకు ఇప్పుడు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటున్న భద్రతా బలగాలు... డ్రోన్ల సాయంతో నక్సల్స్ స్థావరాలను సులభంగా గుర్తించి దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రతి ఎన్ కౌంటర్ లోనూ దాదాపు పదుల సంఖ్యలో మావోలు మరణిస్తున్నారు. తాజాగా, బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లోని భట్టిగూడ అడవుల్లో మావోయిస్టు శిక్షణ శిబిరాన్ని కోబ్రా బెటాలియన్ జవాన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్ ను తలపించే రీతిలో ఆ శిబిరంలో సౌకర్యాలు ఉండడం గుర్తించారు. దట్టమైన అడవులు, కొండల మధ్య విశాలమైన ప్రదేశంలో భవనాలు, షెడ్లు, ట్రైనింగ్ ఏర్పాట్లు చూస్తుంటే, ఒకేసారి ఎక్కువమందికి శిక్షణ ఇచ్చేలా ఆ శిబిరాన్ని నిర్మించినట్టు భావిస్తున్నారు. కాగా, కోబ్రా బెటాలియన్ జవాన్లు ఆ ట్రైనింగ్ క్యాంప్ ను స్వాధీనం చేసుకుని డిటొనేటర్లతో ధ్వంసం చేశారు.