అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాలో అక్రమ వలసదారులను తరిమేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.చెప్పినట్లుగానే.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచే ట్రంప్ తన వేటను మొదలు పెట్టాడు. పెద్దెత్తున ఇల్లీగల్ ఇమిగ్రేట్లను అరెస్టు చేస్తూ.. వారి దేశాలకు సంకెళ్లు వేసి మరీ ప్రత్యేక విమానాల్లో పంపిస్తున్నారు. ఈ క్రమంలో పలు దేశాలు ట్రంప్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొలంబియా అధ్యక్షుడు అమెరికా సర్కార్ తీరుపై తిరగబడ్డాడు. మా దేశస్తులను సంకెళ్లు వేసి ప్రత్యేక విమానంలో పంపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు.. అమెరికా నుంచి వలసదారులతో వెళ్లిన రెండు సైనిక విమానాలను ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కొలంబియా తీరుపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ఆ దేశం నుంచి పంపే వస్తువులపై సుంకాలు పెంచుతామని, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించడంతో కొలంబియా వెనక్కి తగ్గి విమానాలకు అనుమతిచ్చింది. మరోవైపు అమెరికాలోని ఇండియన్స్ ఉండే రాష్ట్రాల్లోనూ, చర్చ్ లు, స్కూళ్లలో, గురుద్వారాల్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లోని గురుద్వారాల్లో యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్), ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్మెంట్ (ఐసీఈ), కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) సంస్థల అధికారులు సంయుక్తంగా దాడులు చేస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లోని గురుద్వారాలు సిక్కు వేర్పాటువాదులకు, అక్రమ వలసదారులకు అడ్డాలుగా మారిపోయినందుకే తనిఖీలు చేపుడుతున్నామని అమెరికా అధికారులు తెలిపారు. అయితే, గురుద్వారాల్లోకి సాయుధ అధికారులు, భద్రతా సిబ్బంది ప్రవేశించడంపై సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం చర్యలు గురుద్వారాల పవిత్రతను, సిక్కుల విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిక్కు అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (SALDF) ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే ఆ దేశంలోని అక్రమ వలసదారులపై డీహెచ్ఎస్ అధికారులు వేట మొదలు పెట్టారు. ఈ క్రమంలో గత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో జారీ చేసిన గైడ్ లైన్స్ ను డీహెచ్ఎస్ రద్దు చేసింది. దీంతో ప్రార్థనా స్థలాలతో పాటు స్కూళ్లు, వైద్యశాలలు వంటి సెన్సిటివ్ ఏరియాల్లోకి సైతం ఐసీఈ, సీబీపీ, అధికారులు వెళ్లి తనిఖీలు చేపట్టేందుకు మార్గం సుగమం అయింది. తెలుగు ప్రజలు ఉండే రాష్ట్రాల్లో అమెరికా అధికారుల వేట కొనసాగుతుంది. దీంతో అక్రమంగా అమెరికా వెళ్లి ఆయా రాష్ట్రాల్లో తలదాచుకుంటున్న వారు భయంతో వణికిపోతున్నారు.
వివిధ దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు ఎఫ్-1 వీసాలపై అమెరికాకు వెళ్లారు. అయితే, అక్కడ చదువు ఖర్చుల కోసం కళాశాలల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాజాగా ట్రంప్ సర్కార్ చర్యలతో వారంతా హడలిపోతున్నారు. మరోవైపు ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి శాండియాగో, ఎల్ పాసోల్లో 15వేల మంది సైనికులను అమెరికా ప్రభుత్వం మోహరించింది.
షికాగో, అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, నెబ్రాస్కా, టెక్సాస్, రాష్ట్రాల్లోనూ స్పెషల్ ఆపరేషన్లు చేపట్టనున్నట్లు ఫెడరల్ అధికారులు తెలిపారు. డెన్వర్ లో 50 మందిని అరెస్టు చేశారు. వారిని నుంచి కొకైన్, హ్యాండ్ గన్స్, నగదు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా వ్యాప్తంగా శని, ఆదివారాల్లో 1242 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు ఐసీఈ అధికారులు తెలిపారు.