ట్రెండింగ్
Epaper    English    தமிழ்

8 నెలలుగా ఐఎస్ఎస్‌లోనే సునీతా విలియమ్స్,,,తీసుకొచ్చే బాధ్యతలు ఎలాన్ మస్క్‌కు అప్పగించిన ట్రంప్

Technology |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2025, 11:39 PM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌‌లను సురక్షితంగా తీసుకొచ్చేందుకు సహకరించాలని ఎలాన్ మస్క్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. గతేడాది జూన్‌లో వారం రోజుల పరిశోధనల కోసం ఐఎస్ఎస్‌కు వెళ్లిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లు అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని సురక్షితంగా తిరిగి తీసుకొచ్చేందుకు అమెరికా అంతరిక్ష పిరిశోధన సంస్థ నాసా ప్రయత్నాలు చేస్తోంది. వారిని ఐఎస్ఎస్‌కు తీసుకెళ్లిన బోయింగ్ స్లార్‌లైనర్‌‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారు ఐఎస్ఎస్‌లో ఉండిపోవాల్సి వచ్చింది.


ఈ క్రమంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములను తీసుకొచ్చేందుకు ట్రంప్ తనను సాయం అడిగినట్టు మస్క్ వెల్లడించారు. ‘ఐఎస్ఎస్‌లో నెలలుగా ఇద్దరు వ్యోమగాములను చిక్కుకుపోయినా నాటి బైడెన్ యంత్రాంగం పట్టించుకోలేదు.. ఇది చాలా దారుణం.. నాసా క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చేందుకు కొద్ది నెలల కిందటే స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది’ అని మస్క్ తెలిపారు. వీలైనంత త్వరగా వ్యోమగాములను ఐఎస్ఎస్ నుంచి తీసుకురావాలని ట్రంప్ కోరారని, మేము త్వరలోనే వారిని తీసుకొస్తామని చెప్పారు.


ఐఎస్ఎస్‌లో వ్యోమగాములు చిక్కుకున్న అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం స్పందించారు. వారిని వెనక్కి తీసుకొచ్చే మిషన్ త్వరలోనే చేపడతామని తెలిపారు. ‘ఎలాన్ మస్క్ త్వరలోనే ఈ మిషన్‌ చేపడతారు... అందరూ సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నాను. గుడ్‌లక్ మస్క్’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు, వ్యోమగాములు ఐఎస్ఎస్‌లో క్షేమంగా ఉన్నారని, వారు అక్కడ చిక్కుకోలేదని నానా పదేపదే చెబుతూ వస్తోంది. అంతేకాదు, ఐఎస్ఎస్‌లో వ్యోమగాముల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండబోదని, అన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయని తెలిపింది.


ఐఎస్ఎస్‌లో ఉన్న వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితులను ఫ్లైట్‌ సర్జన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని నాసా వెల్లడించింది. వ్యోమగాములకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారని చేస్తారని స్పష్టం చేసింది. ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉన్నారని నానా స్పేస్‌ ఆపరేషన్స్‌ మిషన్‌ డైరెక్టరేట్‌ అధికార ప్రతినిధి జిమ్మీ రస్సెల్‌ గత నెలలో తెలిపారు.


అయితే, ఎక్కువ కాలం భారరహిత స్థితిలో ఉంటే వ్యోమగాములు కండరాల క్షీణత బారిన పడే అవకాశం ఉందని.. ఎముకల పటిష్టత కూడా తగ్గుతుందని.. పోషకాలలేమి సమస్యలు వస్తాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్‌, బుచ్ విల్‌మోర్ ఎప్పుడు తిరిగొస్తారనే దానిపై స్పష్టత లేదు. వారిని ఫిబ్రవరిలోనే తీసుకొస్తామని నాసా గతంలో ప్రకటించింది. కానీ, మళ్లీ అది మార్చికి వాయిదా పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com