ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ,,,,దేశంలోనే తొలి "డ్రోన్ సిటీ".

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 07:18 PM

డ్రోన్ల తయారీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హబ్‌గా మార్చాలనేది ఏపీ సర్కారు లక్ష్యం. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఓ డ్రోన్ తయారీ సంస్థ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు డ్రోన్ తయారీ సంస్థ గరుడ ఏరోస్పేస్ ముందుకు వచ్చింది. ఏపీలో డ్రోన్ సిటీ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గరుడ ఏరోస్పేస్ ప్రకటించింది. ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఈ డ్రోన్ సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్ ఆవిష్కరణలకు, పరిశోధనలను ప్రోత్సహించడానికి, పెట్టుబడుల ఆకర్షణకు, డ్రోన్ టెక్నాలజీలో భారతదేశాన్ని ముందు వరుసలో ఉంచడానికి ఈ డ్రోన్ సిటీ ఉపయోగపడుతుందని గరుడ ఏరోస్పేస్ ఓ ప్రకటనలో తెలిపింది.


పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సంస్థ ప్రతినిధులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గరుడ ఏరోస్పేస్ ఫౌండర్, సీఈవో అగ్నిశ్వర్ జయప్రకాష్.. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా తమ భాగస్వామ్యం గురించి వివరించారు. అలాగే గరుడ ఏరోస్పేస్ విస్తరణ ప్రణాళికలు వెల్లడించారు. డ్రోన్ల ఆవిష్కరణ, అత్యాధునిక పరిశోధనల ప్రోత్సాహం, అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడం, డ్రోన్ టెక్నాలజీలో దేశం ముందంజ వంటి వాటికి డ్రోన్ సిటీ హబ్‌గా మారుతుందని ఆయన వివరించారు. మరోవైపు గరుడ ఏరోస్పేస్ ఇప్పటికే టైప్ సర్టిఫికేషన్, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అనుమతులు సహా డీజీసీఏ నుంచి ఆరు రకాల అనుమతులు పొందింది.


మరోవైపు కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 1200 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ వాహనాల పార్కు ఏర్పాటు కోసం పీపుల్ టెక్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీలో ఎలక్ట్రిక్ వాహనాల పార్క్ ఏర్పాటు కానుంది. రూ.1800 కోట్లు పెట్టుబడితో దీనిని అభివృద్ధి చేయనున్నారు. అలాగే రూ.14000 కోట్లతో దేశంలోనే తొలి ప్రైవేట్ సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ ఓర్వకల్లులో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇండీచిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్, యిటోవా మైక్రో టెక్నాలజీ లిమిటెడ్‌ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com