ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయాల్లో వీఐపీ దర్శనాలు రద్దు చేయాలని సుప్రీంలో పిల్

national |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 08:30 PM

దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో వీఐపీలకు ప్రత్యేక దర్శనాలు కల్పించడం వల్ల.. సామాన్య భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వీఐపీలకు స్పెషల్ దర్శనాలు కల్పించడం వల్ల.. గంటల తరబడి మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు క్యూలైన్లలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇలా రద్దీ ఎక్కువగా ఉన్నపుడు తోపులాటలు, తొక్కిసలాటలు జరిగి దేశవ్యాప్తంగా పలు విషాధ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైంది. ఆలయాల్లో వీఐపీ దర్శనాలు కల్పించడం ఆపాలని పిటిషనర్ కోరగా.. అందుకు నిరాకరించింది. ఇప్పుడు ఈ పిటిషన్‌కు సంబంధించి ఎలాంటి ఆదేశాలను కూడా జారీ చేయడానికి కోర్టు ఒప్పుకోలేదు.


ఈ పిల్‌పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిల్‌పై విచారణ జరుపుతోంది. అయితే పిటిషనర్ లేవనెత్తిన అంశాలు నిజమేనని ధర్మాసనం ఏకీభవించినప్పటికీ.. కోర్టు స్వంతంగా ఎలాంటి ఉత్తర్వులు లేదా మార్గదర్శకాలను జారీ చేయడం సరైంది కాదని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర సంస్థలు తమ విచక్షణ ప్రకారం.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చని వెల్లడించింది.


అంతేకాకుండా ఆలయాల్లో వీఐపీ దర్శనానికి అదనపు రుసుములు వసూలు చేయడాన్ని పిటిషనర్ వ్యతిరేకించారు. దేవాలయాల్లో కొంతమందికి ప్రాధాన్యత ఇచ్చి.. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆకాష్ వశిష్ఠ అనే లాయర్ పిల్ దాఖలు చేశారు. అయితే ఈ పిల్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు అంగీకరించలేదు. ఈ అంశంపై సమాజం, ఆలయ నిర్వహణ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు ఎలాంటి దిశానిర్దేశం చేయదని వెల్లడించింది.


దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నందున కొన్ని నియమ నిబంధనలు అవసరం అని లాయర్ ఆకాష్ వశిష్ఠ పేర్కొన్నారు. ఆలయాల్లో వీఐపీ దర్శనం వ్యవస్థ మొత్తం ఏకపక్షంగా ఉందని తెలిపారు. బృందావనంలోని శ్రీ రాధా మదన్ మోహన్ ఆలయానికి చెందిన విజయ్ కిషోర్ గోస్వామి కూడా ఇదే అంశంపై దాఖలు చేసిన పిటిషన్‌పైనా కోర్టు విచారణ జరుపుతోంది. దేవాలయాల్లో వీఐపీ సంస్కృతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లో పొందుపరచబడిన సమానత్వ హక్కును ఉల్లంఘించడమేనని ఆ వ్యాజ్యంలో పిటిషననర్ పేర్కొన్నారు. అయితే వీటన్నింటినీ విన్న కోర్టు.. వీఐపీ దర్శన విధానాలకు సంబంధించి ఆలయ నిర్వహణ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com