బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం కారణంగా జుట్టు మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. జుట్టు రాలిపోవడం, చుండ్రు, దురద, పల్చని వెంటుక్రలు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళల్లో చాలా మందికి జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు రాలిపోవడం వల్ల చాలా మంది టెన్షన్ పడుతున్నారు. జుట్టు రాలిపోయి బట్టతల సమస్య వస్తుందన్న ఆందోళన చాలా మందిలో ఉంది. అయితే, ప్రోటీన్ల లోపం, పొల్యూషన్, ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. అయితే, మహిళల్లో జుట్టు రాలిపోవడానికి కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రక్తహీనత
భారతదేశంలో 80 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. చాలా సార్లు, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా, మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఐరన్ లోపం కారణంగా రక్తహీనతకు గురవుతారు. రక్తహీనత అంటే శరీరంలో రక్తం లేకపోవడం. దీనివల్ల పోషకాహార లోపం, బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం, శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. రక్తహీనత కారణంగా మహిళల్లో జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది.
డైటింగ్
కొందరు మహిళలు బరువు తగ్గడం కోసం డైటింగ్ చేస్తుంటారు. నాజూకైన శరీరం కోసం తిండి తినకుండా ఉంటారు. అయితే, డైటింగ్ కారణంగా మహిళల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. పోషకాల లోపం జుట్టుకు తగిన పోషణ అందదు. ఫలితంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అందుకే పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే డైటింగ్ చేయండి. లేదంటే ఎలా పడితే డైటింగ్ చేశారంటే బరువు తగ్గడం పక్కన పెడితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
థైరాయిడ్ సమస్య
థైరాయిడ్ స్థాయిలు తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేయదు. ఈ కారణంగా, శరీరంలో అవసరమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాల లోపం ఉంటుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందవు. మహిళల్లో జుట్టు రాలడానికి థైరాయిడ్ కూడా ఒక సమస్య అంటున్నారు నిపుణులు.
గర్భధారణ సమయం
మహిళల గర్భధారణ సమయంలో హార్మోన్లలో అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా మహిళల శరీరంలో కూడా మార్పులు సంభవిస్తాయి. హార్మోన్లలో మార్పులు కారణంగా జుట్టు రాలడం కూడా ప్రారంభమవుతుంది. అయితే ఈ కాలంలో విటమిన్లు, ఐరన్ వంటివి తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. అందుకోసం సమతుల్య ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవాలి. అంటే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, విత్తనాలు, తృణధాన్యాలు వంటివి తినాలంటున్నారు నిపుణులు.
కెమికల్ ప్రొడక్ట్స్ వాడకం
ప్రతి ఒక్కరి అందంలో జుట్టు కీలకపాత్ర పోషిస్తుంది. దీంతో, జుట్టుని అందంగా ఉంచడం కోసం రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్, మార్కెట్లో దొరికే రసాయన పదార్థాల్ని వాడుతుంటారు. కొందరు స్టైల్ కోసం హెయిర్ డై, స్టైలింగ్ ఉత్పత్తులు, జుట్టును వేడి చేసే సాధానాలు వాడుతుంటారు. అయితే, వీటిలో ఉండే రసాయనాలు జుట్టుకు మేలు చేయకపోగా.. హానికరం. దీంతో, జుట్టు బలహీనపడి ఎక్కువగా రాలిపోతుంటుంది. అందుకే నిపుణుల సలహా ప్రకారం మీ జుట్టుకు ఏ ప్రొడక్ట్ వాడాలో తెలుసుకోండి.
హెయిర్ స్టైల్ సాధనాల వాడకం
చాలా మంది తమ జుట్టును స్టైల్ చేయడానికి స్ట్రెయిట్‌నెర్‌లు, కర్లర్‌లు లేదా హెయిర్ డ్రైయర్‌లను ఉపయోగిస్తారు. వీటి వాడకం వల్ల జుట్టు అందంగా కనిపించవచ్చు. అయితే, ఈ సాధనాల వాడకం వల్ల చాలా నష్టం కలుగుతుంది. వీటిని రోజూ వాడటం వల్ల జుట్టు బలహీనమై రాలడం మొదలవుతుంది.
జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలి?
* ఆహారంలో ఒమేగా-3, బయోటిన్, ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తప్పకుండా చేర్చుకోండి.
* తేలికపాటి షాంపూ ఉపయోగించండి. తలస్నానానికి హాట్ వాటర్ వద్దు. చల్లని నీరు లేదా గోరు వెచ్చని నీరు వాడండి.
* జుట్టు విపరీతంగా రాలుతున్నట్లయితే, మూలాలను సున్నితంగా మసాజ్ చేయండి. దీంతో జుట్టు బలంగా మారుతుంది.
* మీ జుట్టు రకాన్ని బట్టి హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్ ఉపయోగించండి.
* తడి జుట్టును ఎప్పుడూ దువ్వకండి.
* హెయిర్ స్టైల్ సాధనాల్ని పరిమితం చేయండి.