రాష్ట్రంలో నేటి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు మొదలవ్వనుంది. ఒక్క అమరావతి ప్రాంతంలో మినహా అన్ని చోట్ల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపుపై తీవ్రంగా కసరత్తు చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఆస్తుల విలువ పెంచి, తద్వారా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.ఈ ప్రతిపాదనలకు జిల్లాల్లోని జేసీ కమిటీలు సైతం తాజాగా గురువారం ఆమోదం తెలపడంతో శనివారం నుంచి పెరిగిన చార్జీలు అమలులోకి రానున్నాయి.
ఇప్పుడున్న దానికంటే 40–50 శాతంపైగానే రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. పర్యవసానంగా నగరాల్లో అపార్టుమెంట్లు, ప్లాట్లు కొనుగోలు చేసే వారిపై ఏకంగా రూ.లక్షల్లో భారం పడనుంది. ప్రాంతాలను బట్టి భూముల క్లాసిఫికేషన్ చేసి రేట్లు నిర్ధారించింది. గతానికి భిన్నంగా ప్రాంతాన్ని బట్టి కాకుండా, స్థలాన్ని బట్టి రేటు నిర్ణయించడం గమనార్హం. ఇకపై ఒకే ప్రాంతంలో రోడ్డుకు పక్కన స్థలం ఒకరేటు.. దానికి పక్కనున్న స్థలానికి ఇంకో రేటు, కాస్త లోపల ఉన్న స్థలానికి మరో రేటు ఉంటుంది.