బ్రిటన్ మాజీ ప్రధాని, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ముంబయి మహా నగరానికి వచ్చిన రిషి సునాక్ స్థానికులతో కలిసి ఉత్సాహంగా క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన ఫొటోను సునాక్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ముంబయి వస్తే టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాల్సిందే... టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా ముంబయి పర్యటన పూర్తి కాదు అని ఈ భారత్ అల్లుడు పేర్కొన్నారు. 2022లో బ్రిటన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్... 2024 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రెండేళ్ల పాటు ఆయన ప్రధానిగా కొనసాగారు. రిషి సునాక్... 2009లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి-సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షత మూర్తిని వివాహమాడారు. రిషి సునాక్-అక్షత మూర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.