మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. విశాఖలో సీఆర్‌జెడ్ నింబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరపడంపై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలపై ఈరోజు (బుధవారం) హైకోర్ట్‌లో విచారణ జరిగింది. అక్రమ నిర్మాణాలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అధికారులపై హైకోర్ట్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.నేహారెడ్డి చేస్తున్న నిర్మాణాలు సీఆర్‌జెడ్ పరిధిలో ఉన్నాయా.. ఒకవేల ఉంటే దాన్ని తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని సీఆర్‌జెడ్ అధికారులను అప్పట్లో హైకోర్టు ఆదేశించింది.
అయితే తాము అడిగినప్పటికీ ఇంత వరకు సీఆర్‌జెడ్ అధికారులు నివేదిక ఇవ్వలేదని కోర్టుకు ప్రభుత్వ అధికారులు తెలిపారు. దీంతో సీరియస్ అయిన హైకోర్టు.. విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ కమిషనర్, సీఆర్‌జెడ్ మెంబర్ సెక్రటరీలతో కమిటీని నియమించింది.భీమునిపట్నం పరిధిలో సీఆర్‌జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరిగాయా.. నిర్మాణాలు జరిగితే ఎప్పుడు చేశారు.. వాటికి సంబంధించిన వివరాలు వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశాలు చేసింది. సిన్సియర్ అధికారులతో పరిశీలన చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా చేసిన నిర్మాణాలను కూల్చి వేయాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది. నివేదిక ఇవ్వని పక్షంలో వచ్చే వారం కమిటీలో ఉన్న అధికారులు కోర్ట్ ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. విచారణ నివేదికను కూడా కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేశారు. వచ్చే వారానికి కేసు విచారణ వాయిదా పడింది.