వైసీసీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబెట్టిన డాక్యుమెంట్లు, డైరీల మర్మమేమిటంటూ టీడీపీ పార్టీ ప్రశ్నించింది.ఉదయం లిక్కర్ స్కాంలో సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) పడింది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిందంటూ ఎక్స్ వేదిక ట్వీట్ చేసింది. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి ? సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా ? అని టీడీపీ ప్రశ్నించింది. నిన్న సాయంత్రం జరిగితే, ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు ? తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే, 2.O నా ? అని టీడీపీ నిలదీసింది. ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదని.. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, నీ అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ..స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్ అంటూ టీడీపీ పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది.జగన్ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం సమగ్ర విచారణ కోసం విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్త బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకూ మద్యం విధానంలోని లోపాల మాటున సాగిన అక్రమాలపై ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది. ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబరు 23న ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సీఐడీ విభాగాధిపతి పర్యవేక్షణ, నియంత్రణలో సిట్ పనిచేయనుంది. దర్యాప్త అధికారాల కోసం దీనికి పోలీసు స్టేషన్ హోదా కల్పించారు. ఎక్కడైనా సోదాలు, తనిఖీలు, అవసరమైన పత్రాలు స్వాధీనం చేసుకునే, సాక్షులను విచారించే అధికారాన్ని ఇచ్చారు. సిట్ కు అన్ని ప్రభుత్వ శాఖలూ సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది.
వైసీపీ ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు, బినామీలకు నిర్దేశిత కమీషన్లు చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే అత్యధిక శాతం కొనుగోలు ఆర్డర్లు (ఓఎఫ్ఎస్- ఆర్డర్ ఫర్ సప్లై) కట్టబెట్టారన్న ఆరోపణులున్నాయి. ఆ సరఫరా సంస్థల నుంచి కొన్న మద్యానికి చెల్లించే 'బేసిక్ స్ట్రెస్' (మూల ధర)ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ది కలిగించారని.. ప్రతిగా ఆ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారని... ఒక్కో కేసుకు రూ.150 నుంచి రూ.450 చొప్పున దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా దోచేశారు' అని దర్యాప్తులో సీఐడీ తేల్చింది. ఈ సొత్తు హవాలా నెట్వర్క్ ద్వారా ఆనాటి ప్రభుత్వ పెద్ధలకు చేరిందన్న అభియోగాలపై సిట్ దర్యాప్తు చేయనుంది.