గాజా స్ట్రిప్ లోని హమాస్ మిలిటెంట్లకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బందీలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇందుకోసం శనివారం వరకు డెడ్ లైన్ విధించారు. ఆలోగా బందీలందరినీ విడిచిపెట్టకుంటే నరకం చూపిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు ఓవెల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు.రెండేళ్లుగా జరుగుతున్న హమాస్- ఇజ్రాయెల్ యుద్ధానికి ఇటీవల తాత్కాలికంగా విరామం పలికిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందం మేరకు గాజాలో తాత్కాలికంగా శాంతి నెలకొంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల నేపథ్యంలో ఇల్లూవాకిలీ వదిలిపెట్టి వెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి గాజాకు చేరుకుంటున్నారు. నిత్యావసర సరుకులతో వాహనాలు గాజా స్ట్రిప్ లోకి ప్రవేశిస్తున్నాయి. పరిస్థితి కుదుటపడుతుందనే సమయంలో హమాస్ మిలిటెంట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఇజ్రాయెల్ కాల్పుల విమరణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోందని, తమపై దాడులు చేస్తోందని ఆరోపించారు. ఇలాగైతే బందీల విడుదల మరింత ఆలస్యం అవుతుందని ఆల్టిమేటం జారీ చేశారు.హమాస్ బెదిరింపులపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా స్పందించారు. తన ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ హమాస్ మిలిటెంట్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. బందీల విడుదల ఇప్పటికే ఆలస్యమైందని, శనివారంలోగా అందరినీ విడిచిపెట్టకపోతే హమాస్ మిలిటెంట్లకు నరకం చూపిస్తానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. డెడ్ లైన్ దాటితే కాల్పుల విరమణ ఒప్పందం రద్దుకు పిలుపునిస్తానని, ఈ విషయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు.
![]() |
![]() |