చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ.. చకచకా కదులుతున్న ఫైళ్లు.. సిద్ధంగా ఉన్న నిధులు.. వరుసగా మొదలవుతున్న పనులు.. ఐదేళ్ల పాటు విధ్వంసాన్ని తట్టుకున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మూడేళ్లలో సిద్ధం కానుంది. ఈ మేరకు రాజధాని నిర్మాణ పనులు పూర్తిచేయడానికి సీఆర్‌డీఏ ఒక టైమ్ టేబుల్‌ను రూపొందించుకుంది. ప్రస్తుతం టెండర్లు పిలుస్తున్న పనులన్నింటినీ గరిష్ఠంగా మూడేళ్లలో పూర్తి చేయాలని, రాజధానికి ఒక రూపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్షేత్ర స్థాయిలో ఏ ప్రాజెక్టు ఎంత సమయంలో పూర్తి చేయాలన్న కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటికే పిలిచిన రూ. 20 వేల కోట్ల విలువైన టెండర్లను ఖరారు చేయలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికల కోడ్ ముగిసే మార్చి 8న లెటర్ ఆఫ్ అగ్రిమెంట్స్ (ఎల్‌ఓఏ) ఇచ్చి మార్చి 15 లోపు ఆ టెండర్లను ఖరారు చేయాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ఉగాది నాటికి అమరావతిలో సీఆర్‌డీఏ కాంప్లెక్స్‌లో పలు సంస్థలు విధులు నిర్వహించేలా పనులు పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏ తొలి లక్ష్యంగా నిర్దేశించుకుంది.ఇక్కడే సీఆర్‌డీఏ, ఏడీసీతో పాటు మునిసిపల్ పట్టణాభివృద్ధి సంస్థ, కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్, టౌన్ అండ్ కంట్రీ ప్లాన్, మునిసిపల్ మంత్రి కార్యాలయం ఇతర మునిసిపల్ సంబంధిత కార్యాలయాలన్నీ కొలువుతీరతాయి. ఆ తర్వాత గరిష్ఠంగా ఏడాదిన్నరలోపు అఖిలభారత సర్వీసు (ఏఐఎస్), ఎన్‌జీఓ, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీల భవన నిర్మాణ పనులను పూర్తి చేయనుంది. రాజధానిలో ట్రంక్ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌లో భాగంగా నిర్మించే రోడ్లను ఏడాదిన్నరలో పూర్తి చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకుంది. రాజధానిలో ఎల్‌పీఎస్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనను కూడా గరిష్ఠంగా ఏడాదిన్నరలోపు పూర్తి చేయనున్నారు. ఇక అమరావతి రాజధానిలో అత్యంత ప్రధానమైన సచివాలయం జీఏడీ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు సంబంధించి ఇంకా టెండర్లు పిలవాల్సి ఉంది. ఈ ఐకానిక్ బిల్డింగ్‌లను గరిష్ఠంగా రెండున్నరేళ్లలో నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే.. అమరావతిలో కేంద్ర సంస్థలకు భూ కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేసి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. కేంద్ర సంస్థలకు మొత్తంగా 1,278 ఎకరాలను కేటాయించారు. త్వరలో క్యాబినెట్ ముందుకు తీసుకువెళ్లి ఈ కేటాయింపులకు ఆమోదం పొందనున్నారు.
![]() |
![]() |